2005కు ముందు కరెన్సీ నోట్లను గుర్తించడమెలా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా నకిలీ నోట్ల (కరెన్సీ) సమస్య అధికమైపోయింది. రోజు ఎక్కడో ఒక చోట పోలీసులు నకిలీ కరెన్సీను పట్టుకుంటూనే ఉంటున్నారు. నకిలీ కరెన్సీ మాఫియాను అడ్డుకునేందుకు అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే, నకిలీ నోట్లను ముద్రించే దుండగులు ఇప్పుడు కొత్త ఉపాయాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ ముద్రిస్తే, సులువుగా దొరికిపోతామని భావించిన క్రిమినల్స్, పాత కాలపు కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి, ఇటు ప్రజలను అటు బ్యాంకులను ఆలోచనలో పడేలా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రజలు ఏవి నకిలీ నోట్లు లేక ఏవి ఒరిజినల్ నోట్లు అనేవి తెలుసుకోలేకపోతున్నారు. 2005 సంవత్సరానికి ముందు చలామణిలో ఉన్న నోట్లను టార్గెట్‌గా చేసుకొని దుండగులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది దగ్గర ఇంకా 2005 సంవత్సరానికి ముందు రూ.100 నోట్లు ఉన్నప్పటికీ, వాటిని కూడా నకిలీ నోట్లుగా భావించి అనేక చోట్ల వాటిని అంగీకరించడం లేదు. మరి 2005 ముందు, 2005 తర్వాత నోట్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పై ఫొటోను గమనించినట్లయితే, 2005కు ముందు ఆ తర్వాత జారీ చేసిన నోట్లను పక్కపక్కనే ఉంచి చూస్తే.. పలు వ్యత్యాసాలు కనిపిస్తాయి. కొత్త తరం కరెన్సీ నోట్లపై ఓ వైపు రూపీ సింబల్, స్పష్టమైన సీరియల్ నెంబర్, ఆర్‌బిఐ స్ట్రిప్, నోటులో దాగి ఉండే 100 అనే అక్షరం (లైట్ క్రింద ఉంచి చూస్తే కనిపిస్తుంది) మొదలైన గుర్తులు ఉంటాయి. అంతకు ముందు తరం నోట్లపై ఈ మార్పులు ఉండవు.

ఈ ఫొటోను గమనిస్తే.. ఈ రెండు రకాల నోట్లను తిరగేసి చూసినప్పుడు.. కొత్త తరం నోట్లపై రూపీ సింబల్, ఆ నోటు ముద్రించబడిన సంవత్సరం కనిపిస్తాయి. పాత తరం నోట్లపై ఈ మార్పులు కనిపించవు. నకిలీ కరెన్సీ విషయంలో పాఠకులకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ కథనాన్ని ప్రచురించడమైనది, పాఠకులు గమనించగలరు.


Click it and Unblock the Notifications








