ఎండలు బాబోయ్ ఎండలు.. భగభగ మండే ఎండలు.. మరి ఈ మండు వేసవిలో చల్లగా ప్రయాణించడం ఎలా..?
సాధారణంగా ఈ వేసవి సీజన్ లో కార్ల యజమానులు చాలా సందర్భాల్లో తమ కార్లను ఆరుబయట పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎండలో కారును ఎక్కువసేపు పార్క్ చేయటం వలన, కారు లోపలి వాతావరణం చాలా తక్కువ సమయంలోనే అత్యంత వేడిగా మారిపోతుంది. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో దూరప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం అంత మంచిది కాదు. కానీ అత్యవసర ప్రయాణాలను మనం నివారించలేము. కాబట్టి, ఇలాంటి ప్రయాణాల సమయంలో మన కార్లలో కొన్ని కీలకమైన యాక్ససరీలు ఉండటం చాలా అవసరం. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సన్ షేడ్స్ (Sun Shades)
రోడ్లపై తిరిగే కార్లకు నల్లటి సన్ ఫిల్మ్స్ (టింట్స్) ఉపయోగించడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. నిజానికి విండో టింటింగ్ కారణంగా బయటి వేడి లోపలికి ప్రవహించకుండా, కారు లోపల ఏసి త్వరగా వ్యాపిస్తుంది. అయితే, మనదేశంలో కారు అద్దాలకు సన్ ఫిల్మ్ వాడకం నిషేధం కాబట్టి, ఇందుకు చక్కటి ప్రత్యామ్నాయం బయటి మార్కెట్లో లభించే ఇలాంటి సన్ షేడ్స్, సన్ షేడ్ కర్టెన్స్ మొదలైనవి.

మండుటెండలో రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు బయటి నుండి వచ్చే సూర్యకిరణాలను మరియు వేడిని అడ్డుకునేందుకు ఈ సన్ షేడ్స్ చక్కగా ఉపయోగపడుతాయి. నాణ్యమైన సన్ షేడ్స్ ఉపయోగించడం వలన కారు క్యాబిన్ వేడెక్కడం కూడా తగ్గుతుంది. కాబట్టి, వేసవి ఎండల్లో కార్లలో ప్రయాణించేటప్పుడు ఈ యాక్ససరీ తప్పనిసరిగా మీ కారులో ఉండటం ఎంతో అవసరం. సాధారణంగా కొన్ని ప్రీమియం కార్లలో కంపెనీలే ఇలాంటి ఫీచర్లను స్టాండర్డ్ గా లేదా యాడ్-యాన్ యాక్ససరీగా అందిస్తాయి.

నెక్ రెస్ట్ లు మరియు లంబార్ పిల్లో (Neck Rests and Lumbar Pillow)
వేసవి కాలంలో ప్రయాణాలు చాలా చికాకుగా అనిపిస్తాయి మరియు మనల్ని త్వరగా అలసిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా, కారులో నిటారుగా కూర్చుని ఎక్కువ కాలం వాహనాన్ని నడుపుతున్నప్పుడు మెడ మరియు నడుము ప్రాంతాల్లో నొప్పిగా అనిపిస్తుంది. ఇలా ఎక్కువ సేపు విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయడం వలన డ్రైవర్ మరియు ప్రయాణీలుకు ఎవరైనా సరే అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది.

ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఆఫ్టర్ మార్కెట్ యాక్ససరీస్ రూపంలో లభిస్తుంది. మెడ నరాలకు విశ్రాంతినిచ్చేందుకు నెక్ పిల్లోస్ మరియు వెన్నుకు సపోర్ట్ ఇచ్చేందుకు లంబార్ సపోర్ట్ పిల్లోస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దూరప్రయాణాలలో ఇవి మెడ, నడుము ప్రాంతాలకు హాయినిచ్చేందుకు సహకరిస్తాయి. సాధారణంగా కొన్ని ప్రీమియం కార్లు బిల్ట్-ఇన్ లంబార్ సపోర్ట్ ఫీచర్ తో లభిస్తాయి.

కార్ పెర్ఫ్యూమ్ (Car Perfume)
వేసవిలో చెమటలు పట్టడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. మండే సూర్యుడి కారణంగా మన శరీరం అంతా విపరీతంగా చెమట పడుతుంది. ఫలితంగా, దుర్వాసన వస్తుంది. ప్రత్యేకించి కారులో ప్రయాణించేటప్పుడు ఈ రకమైన దుర్వాసనలు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇందుకు చక్కటి పరిష్కారం కార్ పెర్ఫ్యూమ్స్. కారులో మంచి సువాసన వెదజల్లే పెర్ఫ్యూమ్స్ ఉంటే, ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ సువాసనలు మీ మనస్సుని కూడా రిఫ్రెషింగ్ గా ఉంచుతాయి.

స్మార్ట్ కూలెంట్స్ (Smart Coolants)
ఈ మండు వేసవిలో మనం మాత్రమే చల్లగా ఉంటే సరిపోదు, కారు కూడా చల్లగా ఉండాలి. సమ్మర్ లో కారు ఇంజన్‌ను చల్లగా ఉంచడం చాలా అవసరం. సాధారణంగా ఇంజన్లు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. కానీ వేసవి సమయంలో బయటి వేడి కారణంగా ఇంజన్ మరింత ఎక్కువ వేడిగా తయారవుతుంది. కాబట్టి, ఈ సమ్మర్ లో మీ కారు ఇంజన్ ను చల్లగా ఉంచుకునేందుకు అందులో తగినంత కూలెంట్ ఉండేలా చూసుకోవాలి. సమ్మర్ సీజన్ కోసం ప్రత్యేకమైన స్మార్ట్ కూలెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఏసిని సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో కూడా సహకరిస్తాయి.

కారు కవర్ (Car Cover)
ఈ వేసవి సీజన్‌లో మీ కారుకు అవసరమైన అతి ముఖ్యమైన యాక్ససరీస్ లో కార్ కవర్ కూడా ఒకటి. కారు పార్క్ చేసిన వెంటనే దానిని కార్ కవర్ తో కప్పడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కార్ల యొక్క బయటి పెంయిట్ ను కాపాడటంలో సహాయపడటమే కాకుండా, కారుపై దుమ్ము, ధూళి చేరడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇలాగే, ఇది మండుతున్న ఎండల కారణంగా కారు క్యాబిన్ వేడెక్కకుండా నిరోధిస్తుంది. కాబట్టి, పైన తెలిపినట్లుగా సమ్మర్‌లో కారు ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి తప్పనిసరి యాక్ససరీలను ఉపయోగించి మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోండి.


Click it and Unblock the Notifications