పర్యావరణానికి ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా హాని చేస్తాయట.. ఐఐటీ కాన్పూర్ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి
భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు మెయింటెనెన్స్, ఫ్యూయెల్ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణ హితంగానూ భావిస్తుండటంతో దేశంలో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది.
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే అని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవీల టెక్నాలజీ.. మున్ముందు పర్యావరణంపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది చాలా మందికి సరైన అవగాహన లేదు. దీనిపై IIT కాన్పూర్ ఒక పరిశోధన అధ్యయనం చేసింది. ఈవీలు, ICE వాహనాల కంటే హైబ్రిడ్ వాహనాలు మెరుగైనవని సూచిస్తోంది.

IIT కాన్పూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పర్యావరణంపై ఎలక్ట్రిక్ వాహనాలు సానుకూల ప్రభావం చూపిస్తాయనేది పూర్తిగా వాస్తవం కాదని చెబుతోంది. నిజానికి సాంప్రదాయ(ICE), హైబ్రిడ్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలే పర్యావరణానికి హాని కలిగిస్తాయని అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశోధనా బృందం వివరించింది.
ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడం, ఉపయోగించడం, స్క్రాప్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అవుతాయని అధ్యయనం చెబుతోంది. ఇది హైబ్రిడ్ వాహనం కంటే 15 నుంచి 50 శాతం ఎక్కువ ఉంటాయని ఫలితాలు సూచిస్తున్నాయి. సాధారణంగా ఈవీలు.. భారత్‌లో బొగ్గుతో నడిచే ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌పై ఆధారపడతాయి.

అయితే బొగ్గు నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఎకో ఫ్రెండ్లీగా కనిపించినప్పటికీ, ఇవి పర్యావరణానికి అంత మేలు చేయవనే అంటున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలను సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లుంతుందని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతే ఇవి భవిష్యత్తులో పర్యావరణానికి సమస్యగా మారే అవకాశాలున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ వాహనాల ద్వారా అతి తక్కువ మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల అవుతున్నాయని అధ్యయనం సూచిస్తుంది. కానీ ఈవీలకు అందించినంత ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రభుత్వాలు హైబ్రిడ్ వాహనాలకు అందించడం లేదు.

దీంతో ICE, ఎలక్ట్రిక్ వాహనాల ధరలతో పోలిస్తే హైబ్రిడ్ వాహనాల ధర అధికంగా ఉంటోంది. ఈ కారణంగా హైబ్రిడ్ వాహనాలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా సైంటిస్టులు పరిశోధన చేపట్టారు. పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మరో సమస్య ఉంది. అదే రేంజ్.
ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్లు లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉండవు. కేవలం నగర అవసరాల కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఈ క్రమంలో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారికి ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలతో ఛార్జింగ్ సమస్య ఏర్పడుతోందని అధ్యయనం సూచిస్తోంది. హైబ్రిడ్ వాహనంలో బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయినా ఇంజిన్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. తద్వారా హైబ్రిడ్ వాహనాలు పర్యావరణానికి అనుకూలమైనవిగా పరిశోధకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో దేశంలో హైబ్రిడ్ వాహనాలు జనాదరణ పొందాలంటే.. EVలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీల మాదిరిగానే వీటికీ అందించాలని అధ్యయనం సూచించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతీ ఇన్విక్టో, గ్రాండ్ విటారా, టయోటా హైర్డర్, టయోటా హైక్రాస్, హోండా సిటీ, టయోటా క్యామ్రీ వంటి కార్లను బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించారు.


Click it and Unblock the Notifications








