రద్దీ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్.. హైదరాబాద్ పోలీస్ అధికారిపై సస్పెన్షన్ వేటు
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి చేసిన నిర్వాకం ఆయన ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. హైదరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో రద్దీగా ఉండే గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై కేవలం 6 సంవత్సరాల వయసున్న తన మైనర్ మనవరాలికి ఏకంగా కారు డ్రైవింగ్ సీటు అప్పగించాడో పోలీస్ అధికారి. చిన్నపాప అంత పెద్ద కారును రోడ్డుపై నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు పోలీస్ అధికారిని పూజారి తిరుపతిగా గుర్తించారు. ఆయన తన చిన్నారి మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపిస్తున్న సమయంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారును ఒక చిన్నపిల్ల నడపడం గమనించిన స్థానికులు, వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, తన తప్పును తెలుసుకుని పాపను సీట్లోంచి దించాల్సింది పోయి, ఆ పోలీస్ అధికారి స్థానికులతో ఎదురు వాగ్వాదానికి దిగడమే కాకుండా తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ నిర్లక్ష్యపు తీరుతో కూడిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వ్యవహారంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితుడైన పోలీస్ అధికారి పూజారి తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 125తో పాటు, మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 184, 180 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం, వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్లకు డ్రైవింగ్ శిక్షణ, అనుభవం లేదా చట్టబద్ధమైన అర్హత ఉండవని, కాబట్టి తల్లిదండ్రులు లేదా గార్డియన్లు ఇలాంటి పనులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని రోడ్డు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించాల్సిన పోలీసు అధికారే ఇలా చేయడంలో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్టున్నారు. రోడ్డుపై ఓ కారు అటుఇటుగా నెమ్మదిగా వెళ్తుండడంతో అనుమానం వచ్చిన వాహనదారులు కారు వద్దకు వెళ్లి చూడగా డ్రైవింగ్ సీటులో ఓ బాలిక ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. బాలికతో డ్రైవింగ్ చేయించడం మంచిది కాదని సూచించారు. దీంతో ఆ బాలిక మా తాత పోలీస్.. మీకేంటి? మమ్మల్ని ఆపడానికి మీరెవరు అని ఎదురు ప్రశ్నించింది అని ప్రశ్నించింది.
పక్కన ఉన్న ఎస్సైని ప్రశ్నించగా ఇది ఆటో గేర్ కారు. కంప్లీట్ నా కంట్రోల్‌లోనే ఉంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. కారు చిన్నారి నడిపినా ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా? అంటూ మాట్లాడాడు. చివరకు వాహనదారులందరూ నిలదీయడంతో.. నా ఇష్టం నన్ను అడిగేందుకు మీరెవరంటూ దబాయించాడు.
జనాలు తమ ఫోన్లలో ఈ తతంగం అంతా చిత్రీకరిస్తుంటే నా కారు నంబర్ కూడా రికార్డు చేస్కోండి అంటూ వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నార్సింగి పోలీసులు కేసును సుమోటాగా తీసుఉని కేసు నమోదుచేశారు.


Click it and Unblock the Notifications