పొగ రాదు.. కాలుష్యం ఉండదు.. ఒకేసారి 2600 మంది ప్రయాణం.. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

భారత రవాణా రంగంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా భారత రైల్వే వేసిన ముందడుగు విజయవంతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే సరికొత్త ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న హరియాణాలోని జింద్ రైలింగ్ స్టేషన్ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ కూడా పాల్గొన్నారు.

పట్టాలెక్కిన 'నమో గ్రీన్ రైల్'
నమో గ్రీన్ రైల్(Namo Green Rail) అని పేరు పెట్టిన ఈ రైలును హరియాణాలోని ఉత్తర రైల్వే పరిధిలో ఉన్న 89 కిలోమీటర్ల పొడవైన జింద్ - సోనిపత్ సెక్షన్ మధ్య నడపనున్నారు. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద, స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ ఇంజనీర్లు ఈ రైలును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సంప్రదాయ డీజిల్ ఇంజన్లు లేదా విద్యుత్ తీగలతో పని లేకుండా, తనంతట తానే విద్యుత్‌ను తయారు చేసుకుని నడిచేలా దీనిని అభివృద్ధి చేయడం విశేషం.

India Launches First Hydrogen Train 2 600 Passengers Zero Pollution Tickets Starting at Just Rs 5

పొగ రాదు.. కాలుష్యం ఉండదు
సాంకేతిక వివరాల్లోకి వెళితే.. ఈ రైలులో ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించారు. రైలులోని అధిక పీడన సిలిండర్లలో నిల్వ చేసిన హైడ్రోజన్ వాయువు, వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరపడం ద్వారా ఈ రైలు లోపలే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ సాయంతోనే రైలులోని ట్రాక్షన్ మోటార్లు నడుస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి మంట లేదా ఇంధన దహనం జరగదు. ఫలితంగా రైలు నుంచి ఎలాంటి హానికరమైన పొగ లేదా కార్బన్ ఉద్గారాలు బయటకు రావు. కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే సైలెన్సర్ ద్వారా బయటకు వస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రపంచ రికార్డు సృష్టించిన మేక్ ఇన్ ఇండియా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజా ప్రయోగంతో ఈ అద్భుత టెక్నాలజీ కలిగిన ప్రపంచంలోని ఆరవ దేశంగా భారత్ అవతరించింది. అయితే, విదేశాల్లో నడిచే హైడ్రోజన్ రైళ్లలో సాధారణంగా రెండు నుంచి నాలుగు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, భారతదేశం ఏకంగా 10 కోచ్‌లతో ఈ రైలును నిర్మించి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిపింది. ఈ రైలు ఇంజన్ ఏకంగా 3,200 bhp (2400 కిలోవాట్) శక్తిని ఉత్పత్తి చేయగలదు.

India Launches First Hydrogen Train 2 600 Passengers Zero Pollution Tickets Starting at Just Rs 5

కేవలం 5 రూపాయలకే ప్రయాణం
ఈ రైలు ప్రత్యేకంగా సాధారణ ప్రయాణికుల కోసం రూపొందించబడింది. ఇందులో ఒకేసారి దాదాపు 2,600 మంది ప్రయాణికులు సురక్షితంగా కూర్చుని, నిలబడి ప్రయాణించవచ్చు. ఇంతటి హైటెక్ ఫీచర్లు ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలకు భారం కాకుండా రైల్వే శాఖ టికెట్ ధరలను అత్యంత చౌకగా నిర్ణయించింది. ఈ రైలులో ప్రయాణించడానికి కనీస టికెట్ ధర కేవలం రూ.5లు కాగా, గరిష్ట ధర రూ.25లుగా మాత్రమే నిర్ణయించారు. ఒకసారి పూర్తిస్థాయిలో హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే ఈ రైలు సుమారు 250 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా ప్రయాణించగలదు.

జింద్ టు సోనిపత్ రూట్ మ్యాప్
ఈ గ్రీన్ ప్యాసింజర్ రైలు జింద్ నుంచి సోనిపత్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, బుటానా హాల్ట్, ఖంద్రాయి హాల్ట్, రబ్రాహ్ హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్, సోనిపత్ న్యూ మీదుగా సోనిపత్ జంక్షన్‌కు చేరుకుంటుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పుల చొప్పున మొత్తం 356 కిలోమీటర్లు ఈ రైలు తిరగనుంది. ప్రస్తుతం ప్రారంభ దశలో భద్రతా కారణాల దృష్ట్యా దీని గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లుగా నిర్ణయించినప్పటికీ, ఇది గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

India Launches First Hydrogen Train 2 600 Passengers Zero Pollution Tickets Starting at Just Rs 5

మల్టీ లేయర్ సేఫ్టీ సిస్టమ్
హైడ్రోజన్ ఇంధనం కావడంతో ఈ రైలులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో అత్యాధునిక మల్టీ లేయర్ సేఫ్టీ సిస్టమ్‎ను అమర్చారు. పొరపాటున ఎక్కడైనా హైడ్రోజన్ గ్యాస్ లీకేజీ జరిగినా, లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా ఆటోమేటిక్‌గా గుర్తించే ఫైర్ డిటెక్టర్లు, నిరంతర మానిటరింగ్ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. గ్యాస్ లీక్ అయినట్లు సిగ్నల్ రాగానే రైలు ఆటోమేటిక్‌గా అక్కడికక్కడే ఆగిపోయేలా బ్రేకింగ్ వ్యవస్థను అనుసంధానించారు. దీని కోసం జింద్ రైల్వే స్టేషన్ లోనే ఒక ప్రత్యేకమైన హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా శాశ్వతంగా ఏర్పాటు చేశారు.

ప్రపంచంలోనే ఆరో దేశంగా భారత్
ఈ చారిత్రాత్మక హైడ్రోజన్ రైలు ప్రారంభోత్సవ వేదికగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణా రాష్ట్రంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే రైల్వే, రోడ్లు, ఆరోగ్యం, విద్య, హరిత రవాణా రంగాలకు సంబంధించి మొత్తం 26,800 కోట్ల రూపాయల విలువైన జాతీయ ప్రాజెక్టులను ప్రధాని దేశానికి అంకితం చేశారు.

అనంతరం ప్రధాని పంజాబ్‌లోని జలంధర్ పర్యటనకు బయలుదేరారు. అక్కడ కూడా రూ. 5,470 కోట్ల విలువైన రహదారి, రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. భారతదేశాన్ని నెట్ జీరో ఉద్గారాల దేశంగా మార్చడంలో ఈ హైడ్రోజన్ రైలు మైలురాయిగా నిలవనుంది.

Article Published On: Friday, July 17, 2026, 15:33 [IST]
English summary
India launches first hydrogen train 2 600 passengers zero pollution tickets starting at just rs 5
Read more on: #narendra modi #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+