ఎలక్ట్రిక్ కార్లతో దూసుకుపోతున్న భారత్.. రాబోయే ఐదేళ్ళలో ఆ దేశాన్ని కూడా దాటేస్తుంది!
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో స్పీడుగా దూసుకుపోతోంది. ఈ రంగంలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద తయారీదారుగా ఎదగబోతోంది. ఒక నివేదిక ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో భారతదేశం జపాన్, దక్షిణ కొరియాలను కూడా వెనక్కి నెట్టివేయనుంది. తాజాగా, మారుతి సుజుకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ విటారాను సిద్ధం చేసింది. ఈ కారుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్‌లోని మారుతి ప్లాంట్‌లో పచ్చజెండా ఊపారు.
ఈ కారు సెప్టెంబర్‌లో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికి విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది. భారతీయ ఈవీ మార్కెట్‌లో టాటా, మహీంద్రా వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఇప్పుడు మారుతి కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పరిణామం భారతదేశ ఈవీ భవిష్యత్తుకు శుభసూచకం.

న్యూయార్క్ ఆధారిత పరిశోధనా సంస్థ రోడియం గ్రూప్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 25 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చు. ఇది ప్రస్తుత సామర్థ్యం (2 లక్షల యూనిట్లు) కంటే పది రెట్లు ఎక్కువ. ఈ లక్ష్యం సాధిస్తే, భారతదేశం చైనా, యూరప్, అమెరికా తర్వాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఈవీ తయారీదారుగా నిలుస్తుంది.
ఈ ప్రయాణంలో భారత్ జపాన్, దక్షిణ కొరియాలను కూడా అధిగమిస్తుంది. ప్రస్తుతం జపాన్ సామర్థ్యం 11 లక్షల యూనిట్లు, దక్షిణ కొరియా సామర్థ్యం దాదాపు 5 లక్షల యూనిట్లు. ఈ దేశాలు తమ భవిష్యత్ ప్రణాళికలను నెమ్మదిగా రూపొందిస్తుండగా, భారతదేశం మాత్రం వేగంగా అడుగులు వేస్తోంది.
రోడియం నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 4 లక్షల నుండి 14 లక్షల మధ్య ఉండవచ్చు. కానీ ఉత్పత్తి సామర్థ్యం 25 లక్షల వరకు ఉండనుంది. అంటే, దేశీయ అవసరాల కంటే ఎక్కువ వాహనాలను భారత్ తయారు చేస్తుంది. దీనివల్ల ఇక్కడ ఉత్పత్తి అయ్యే అధిక సంఖ్యలో ఈవీలు ఎగుమతుల కోసం సిద్ధమవుతాయి.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, భారతదేశం ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. దీని కోసం సాంకేతికతను మెరుగుపరచుకోవడం, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం మరియు ఖర్చులను తగ్గించే కొత్త పద్ధతులను అనుసరించడం అవసరం. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ అనే ప్రణాళిక ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కూడా బలంగా మారింది.

బ్యాటరీ తయారీ రంగంలో కూడా భారతదేశం వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. రోడియం నివేదిక ప్రకారం.. భారతదేశం ఇప్పుడు బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ రెండింటినీ తయారు చేస్తున్న అతికొద్ది దేశాలలో ఒకటిగా మారింది. 2030 నాటికి భారతదేశం బ్యాటరీ సెల్ తయారీ సామర్థ్యం 567 గిగావాట్ అవర్స్ (GWh) కు చేరుకోవచ్చని అంచనా. ఇది చైనా (4,818 GWh), అమెరికా (1,169 GWh), యూరప్ (997 GWh) తర్వాత ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంటుంది.
దీంతో భారత్ కొరియా, జపాన్, మలేషియా వంటి దేశాలను కూడా అధిగమిస్తుంది. అయితే, ఈ వృద్ధిలో చాలా వరకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లేదా ఇంకా ప్రకటించబడిన ప్రాజెక్టులపై ఆధారపడి ఉంది. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితేనే ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయి.
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు బలమైన విధానాలను అనుసరిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తోంది. అలాగే, వాహనాలను భారతదేశంలోనే తయారు చేయాలనే షరతు పెట్టింది. బ్యాటరీ మరియు ఇతర విడి భాగాల తయారీదారులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఛార్జింగ్ స్టేషన్లు, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై కూడా దృష్టి పెడుతోంది.
అంతేకాకుండా, విదేశీ ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై 70% నుండి 100% వరకు భారీ దిగుమతి సుంకం విధించింది. దీనివల్ల విదేశీ కంపెనీలు నేరుగా కార్లను అమ్మడం ఖరీదైనదిగా మారింది, ఇది దేశీయ తయారీకి మద్దతు ఇస్తోంది. ఫలితంగా, భారతదేశంలో తయారవుతున్న దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కార్లు మన దేశీయ కంపెనీల ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయి.
అయితే, ఈవీల కొనుగోలు విషయంలో భారతదేశం ఇంకా వెనకబడి ఉంది. ఉదాహరణకు, వియత్నాంలో 2022లో 3% మంది మాత్రమే ఈవీలను కొనుగోలు చేయగా, 2024 నాటికి ఈ సంఖ్య 17%కి పెరిగింది. కానీ భారతదేశంలో 2024 నాటికి ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కేవలం 2% మాత్రమే ఉన్నాయి. ఈవీ మార్కెట్‌ను విజయవంతం చేయడానికి, ప్రభుత్వ విధానాలు స్పష్టంగా, నిరంతరంగా ఉండాలి.
వాహనాల ధరలు మరియు ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలి. అలాగే, వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించాలి - అంటే డ్రైవింగ్ నుండి ఛార్జింగ్ వరకు ప్రతిదీ సులభంగా ఉండాలి. అప్పుడే భారతదేశ ఈవీ పరిశ్రమ నిజంగా పురోగతి సాధించగలదు.


Click it and Unblock the Notifications








