చంద్రయాన్- 3 లాంటి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కి శ్రీకారం.. సముద్రయాన్ ‘మత్స్య 6000'.!!
ఇప్పటివరకు అంతరిక్షంలో పరిశోధనలపై దృష్టి పెట్టిన భారత్.. ఇప్పుడు మరో చరిత్రాత్మకమైన ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రాజెక్టులలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. అయితే ఇప్పుడు సముద్ర గర్భంలో అన్వేషణ దేశం సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గగన్‌యాన్ తరహాలో సముద్రయాన్‌కు భారతీయ శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని దేశాలు మాత్రమే మనుషులను మహా సముద్ర గర్భంలోకి పంపించగలిగాయి. భారత్ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాల సరసన భారత్ కూడా నిలవనుంది.

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ మిషన్‌కు 'సముద్రయాన్' అని పేరు పెట్టారు. ఈ మిషన్ ద్వారా.. సముద్రంలో 6 కి.మీ లోపల ప్రయాణించి అక్కడి రహస్యాలను అన్వేషించడానికి సన్నాహాలను ప్రారంభించారు. ఇటీవల కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆ ప్రాజెక్టు గురించి వివరించారు.
మత్స్య 6000(MATSYA 6000) ప్రాజెక్టు పేరుతో సముద్రంలో అత్యాధునిక సబ్‌మెర్సిబుల్‌ను పంపించనున్నట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన తెలిపారు.

సముద్రం లోతున ఉండే వనరుల వెలికితీయడం ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాలను కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా సముద్రం అడుగు భాగాన పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడానికి ఈ సముద్రయాన్ మిషన్ దోహదపడుతుందని ఆయన అన్నారు.
సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతున అధ్యయనం చేయడం, అక్కడి జీవివైవిధ్యాన్ని తెలుసుకోవడం, దేశాభివృద్ధికి అక్కడి వనరుల ఉపయోగాన్ని పరిశీలించడం వంటిది ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని కిరణ్ రిజిజు అన్నారు. ఈ జలాంతర్గామి సముద్ర జీవ వైవిధ్యానికి ఎలాంటి హాని కలిగించదని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి బ్లూ ఎకానమీ లక్ష్యాలను ఈ మిషన్ మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా మత్స్య 6000 జలాంతర్గామి ద్వారా ప్రధానంగా సముద్రంలో లభించే నికెల్, కోబాల్ట్, మాంగనీస్, సల్ఫైడ్ మరియు గ్యాస్ హైడ్రేట్ ఖనిజాలను కనుగొనడం భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రయోగాత్మకంగా 2024లో ప్రారంభమవుతాయని రిజిజు వెల్లడించారు.
మత్స్య 6000 జలాంతర్గామిలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించగలిగేలా ఏర్పాట్లు చేస్తారు. ఇది2.1 మీటర్ల వ్యాసంతో గోళాకారంలో ఉంటుంది. 80 mm మందపాటి టైటానియం మిశ్రమంతో ఈ సబ్‌మెరైన్‌ను తయారుచేశారు. ఇది సముద్రపు లోతులో 12 గంటల వరకు దీర్ఘకాలికంగా పనిచేయగలదని శాస్త్రవేత్త వివరించారు.
బ్లూ ఎకానమీగా పిలువబడే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సముద్రయాన్ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. ఆర్థికాభివృద్ధిలో మాత్రమే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనలో కూడా దీని సహకారం ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడంలో కూడా ఈ ప్రాజెక్ట్ కీలకం కానుంది.
చేప పదానికి సంస్కృత పదం మత్స్యను ఈ జలాంతర్గామికి పేరుగా పెట్టారు. ఈ జలాంతర్గామి 6 వేల మీటర్లు అంటే 6 కి.మీల సముద్ర లోతులోకి వెళ్లనుంది. అందుకే దీనికి మత్స్య 6000గా నామకరణం చేశారు. 6 కి.మీల లోతుకి వెళ్లినప్పుడు, అక్కడ నీటి పీడనం ఆరు వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పీడనాన్ని తట్టుకునేలా ఈ జలాంతర్గామిని టైటానియం అలాయ్‌తో రూపొందించారు.
అంతరిక్షం, సముద్ర పరిశోధనల్లో ఇటీవలి కాలంలో భారత్ ప్రత్యేక దృష్టి సారించడం చూస్తుంటే.. ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శకం అవుతుందనడంలో సందేహం లేదు. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో భారతదేశం మరో చారిత్రక విజయాన్ని సృష్టించబోతోందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








