ఎయిర్‌బస్ హెచ్ 145 (Airbus H145) హెలికాప్టర్‌ను కొన్న మొదటి భారతీయుడు; ధర రూ.100 కోట్లు
'డబ్బుకు లోకం దాసోహం' అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ అది నూటికి నూరుపాళ్లు సత్యం. చేతిలో డబ్బుంటే విలాసాలకు కొదవే ఉండదు. ఈ ఫొటోలలో కనిపిస్తున్న వ్యక్తిని మరియు అతను చూపిస్తున్న వస్తువును జాగ్రత్తగా పరిశీలించండి. ఇతని పేరు బి రవి పిళ్లై (B Ravi Pillai), భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త. ఈ ఫొటోలో అతను చూపిస్తున్న ఓ హెలికాప్టర్. మరి ఇందులో వింతేముంది అని సింపుల్ గా కొట్టిపారేయకండి. ఇది ఆషామాషా హెలికాప్టర్ కాదు.

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్‌పి గ్రూప్ ఆఫ్ కంపెనీల (RP Group Of Companies) చైర్మన్ బి రవి పిళ్లై ఎయిర్‌బస్ హెచ్- 145 (Airbus H145) హెలికాప్టర్ ను కొనుగోలు చేశారు. ఇదొక విలాసవంతమైన హెలికాప్టర్, దీని ఖరీదు అక్షరాల వంద కోట్ల రూపాయలు. అవును భారతదేశంలో రూ.100 కోట్లు చెల్లించి ఈ విలాసవంతమైన చాపర్ ను కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయుడిగా రవి పిళ్లై నిలిచారు.

ఎయిర్‌బస్ హెచ్- 145 (Airbus H145) చాలా అరుదైనది. విమానాలను తయారు చేసే సంస్థ ఎయిర్‌బస్, రూపొందించిన అత్యాధునిక హెలికాప్టర్ ఈ హెచ్ 145. ఇది పైలట్ తో పాటుగా 7 గురు ప్రయాణికులు, 8 మంది ప్రయాణికులు లేదా 10 మంది ప్రయాణికులు ప్రయాణించగల విభిన్న కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం, రవి పిళ్లై కొనుగోలు చేసిన ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ అనేక సౌకర్యాలు మరియు విలాసవంతమైన ఫీచర్లతో కూడిన 7-సీటర్ వెర్షన్ అని తెలుస్తోంది.

ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాదు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్‌లను భారీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ 723కిలోల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. దీనిసాయంతో హెలికాప్టర్ 650 కిమీల దూరం ప్రయాణించగలదు లేదా 215 నిమిషాల పాటు గాలిలో ఎగరగలదు. ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ గరిష్టంగా 3,800 కిలోల లోడ్‌తో టేకాఫ్ చేయగలదు.

ఇందులో రెండు సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్ ఏరియల్ 2ఈ లు ఉంటాయి. వీటి సాయంతో ఈ హెలికప్టర్ గరిష్టంగా 894.46 బిహెచ్‌పిల టేకాఫ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తునుంచి కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలదు. ఇందులోని పవర్‌ట్రెయిన్ చాలా ప్రత్యేకమైనది. స్టాండర్డ్ ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ యొక్క సిఫార్సు చేయబడిన గరిష్ట వేగం గంటకు 241 కిమీ మరియు ఇది -45°C నుండి 50°C వరకు ఉష్ణోగ్రతల వద్ద కూడా పని చేయగలదు.

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 యూనిట్ల హెచ్ 145 చాపర్లు మాత్రమే తిరుగుతున్నాయి. కాగా, మార్చి 20 ఆదివారం రోజున ఈ హెలిక్యాప్టర్‌లో ఆర్‌పి గ్రూప్స్ వైస్ చైర్మన్ రవి పిళ్లై కోవలం నుంచి ది రవిజ్ అష్టముడి ఫైవ్‌స్టార్ హోటల్ వరకు ప్రయాణించారు. ఈ హోటల్ వద్ద చాపర్ ల్యాండింగ్ కోసం ప్రత్యేమైన ల్యాండింగ్ డాక్ కూడా ఉంది. అంతేకాకుండా, ఆర్‌పి గ్రూప్ కేరళలోని మూడు వేర్వేరు ప్రదేశాలలో వారి స్వంత హెలిప్యాడ్ లను కూడా కలిగి ఉంది.

తిరువనంతపురంలోని రవిజ్ కోవలం, కోజికోడ్‌లోని ది రవిజ్ కడవు మరియు కొల్లంలో ది రవిజ్ అష్టముడి అనే ప్రాంతాలలో వీరికి స్వంత హెలిప్యాడ్ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 68 ఏళ్ల వయస్సున్న ఈ వ్యాపారవేత్త యొక్క ప్రస్తుత సంపద విలువ దాదాపు 2.5 బిలియన్ డాలర్లు. రవి పిళ్లైకి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయన యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

రవి పిళ్లై భారతదేశంలో ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ ను కలిగి ఉన్న మొదటి భారతీయుడు కావడమే కాకుండా, ఆయన కొనుగోలు చేసిన హెలికాప్టర్ ఆసియాలోనే మొదటి ఐదు బ్లేడ్లు కలిగిన ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ కావడం విశేశం. సమాచారం ప్రకారం, రవి పిళ్లై కొనుగోలు చేసిన ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ ను కోవలంలో ఎయిర్‌బస్ సంస్థ డెలివరీ చేసింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం
బిజినెస్ మ్యాన్ రవి పిళ్లై కొనుగోలు చేసిన ఎయిర్‌బస్ హెచ్ 145 హెలికాప్టర్ ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత అరుదైన హెలికాప్టర్లలో ఒకటి మరియు భారతదేశంలోని విలాసవంతమైన హెలికాప్టర్‌లలో ఒకటిగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ హెలికాప్టర్ ల్యాండ్ మరియు టేకాఫ్ చేయడానికి అధునాతన రన్‌వే అవసరం లేనందున ఇది మరింత సౌకర్యవంతమైన రవాణా మార్గంగా ఉంటుంది. అంతే కాకుండా, ఈ కొత్త హెలికాప్టర్ భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి రవి పిళ్లై యొక్క అతిథులు కూడా హెలికాప్టర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున పర్యాటకాన్ని పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications