జ్ఞాపకాలతో నిండిన మొదటి కారు.. రజనీకాంత్, అమితాబ్, సచిన్ ఫస్ట్ కారు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం..
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటాం. కానీ ఎన్ని కొన్న కూడా మన మొదటి కారు గానీ లేదా బైక్ గానీ ఒక ప్రత్యేకం. అది ఎప్పటికీ కూడా గుర్తుండి పోతుంది. ముఖ్యంగా ఒకప్పుడు సాధారణ జీవితం గడిపి ఆ తర్వాత కష్టంతో పెద్ద సెలబ్రిటీగా ఎదిగిన వారికి తమ కెరీర్ ప్రారంభంలో కొనుగోలు చేసిన కారు/బైక్‌పై ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. వాటిని ఇప్పటి వరకు కూడా తమ వాహనాల గ్యారేజీలో పెట్టుకుంటారు. భారతదేశంలో పెద్ద సెలబ్రిటీలు చాలా మంది తాము కొనుగోలు చేసిన మొదటి కారును ఇప్పటికి కూడా వాడుతుంటారు. కొంత మంది అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం తమ ఇంట్లో ఉంచుకుంటారు. వీటిని అపురూపంగా చూసుకోవడంతో పాటు, ఒక ప్రత్యేక అభిమానాన్ని మొదటి కారుపై చూపిస్తారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, రజనీ కాంత్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వంటి నటి నటులు తమ మొదటి కారు గురించిన వివరాలు చాలా సందర్భాల్లో చెప్పారు. వీటి పట్ల వారు ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉంటారు. అందుకే కొత్తగా ఎన్ని లగ్జరీ కార్లు కొనుగోలు చేసినప్పటికీ కూడా తమ మొదటి కారు ఎప్పటికీ స్పెషల్ అని అంటూ ఉంటారు. ఈ సెలబ్రిటీల మొదటి కారు వివరాలను తెలుసుకుందాం.

రజనీకాంత్: పెద్ద స్టార్ అయినప్పటికి నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడే రజనీకాంత్ 1980లలో మొదటి కారును కొనుగోలు చేశారు. ఇది వైట్ ప్రీమియర్ పద్మిని. దీన్ని ఆయన ఇప్పటికి అపురూపంగా చూసుకుంటారు. ఒక క్లాసిక్ మోడల్. 1.1-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. టాప్ బ్రాండ్‌ల లగ్జరీ కార్లు ఉన్నప్పటికి దీన్ని మాత్రం విడిచిపెట్టరు. గతంలో ఇంటి ముందు పార్క్ చేసిన ప్రీమియర్ పద్మిని ముందు నిలబడి ఉన్న ఫోటోను ఆయన పంచుకున్నారు.
అమితాబ్ బచ్చన్: బిగ్ బి అమితాబ్ వద్ద చాలా కార్లు ఉన్నాయి. పాత కాలపు మోడళ్ల నుంచి మొదలుకుని నేటికి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లగ్జరీ కార్ల వరకు అధునాతన ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లు ఆయన గ్యారేజీలో కనిపిస్తాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ కాంటినెంటల్ GT ఇంకా మరిన్ని కార్లు ఉన్నాయి. అమితాబ్ మొదటి కారును సెకండ్ హ్యండ్‌లో కొనుగోలు చేశారు. దీని పేరు ఫియట్ 1100.

సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు క్రికెట్‌తో పాటు కార్లు, బైకులన్నా కూడా చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికి ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. అయితే సచిన్ మొదట కొనుగోలు చేసిన కారు మోడల్ మారుతీ 800. ఈ కారును కొద్ది కాలం వాడిన తరువాత దాన్ని ఇతరులకు అమ్మాడు. అయితే కొన్నేళ్ళ క్రితం ఇది ఎక్కడ ఉందో కనిపెట్టడంలో తనకు సహాయం చేయమని అభిమానులను కోరారు.
దీంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ మారుతీ 800 కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చివరికి ఆ కారును వాడిన స్పిన్నీ మారుతీ 800ని సరికొత్తగా మార్చి, మంచి కండిషన్‌కు తీసుకొచ్చి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు తిరిగి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. మారుతీ 800 కారు లోపల నుంచి డోర్ తీసుకుని బయటకు వస్తున్న సచిన్ ఫోటో గతంలో బాగా వైరల్ అయింది.

ధర్మేంద్ర: సీనియర్ నటుడు ధర్మేంద్ర 1960లో మొదట ఫియట్ 1100 కారును కొనుగోలు చేశారు. ఇది ఇప్పటికి కూడా ఉంది. 60 ఏళ్ల క్రితం రూ.18,000లకు ఈ కారును ఆయన కొన్నారు. ఈ కారుతో నిలబడి ఉన్న వీడియోను గతంలో సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. ఇన్నేళ్ల వరకు కూడా ఈ కారు రన్నింగ్ కండిషన్‌లో ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications








