ఏళ్ల తరువాత రైల్వే టికెట్ ధరల పెంపు! కొంతమందికి ఊరట, మిగతావారి జేబులకు చిల్లు తప్పదు!
భారతీయ రైల్వేల ద్వారా దేశంలో కోట్లాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తక్కువ ధరలో, ఎక్కువ దూరం ప్రయాణించే పేద, మిడిల్ క్లాస్ వారికి రైల్వేలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బస్సులు, విమానాల్లో అయ్యే ఖర్చులతో దీని ద్వారా తక్కువ ఖర్చలో ప్రయాణం చేయవచ్చు. అయితే తాజాగా రైల్వే ధరల గురించి ఒక కీలక సమాచారం వచ్చింది. భారతీయ రైల్వే ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలుస్తుంది. ఈ కొత్త ధరలు వచ్చే నెల అంటే జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రైల్వేలో టికెట్ ధరల పెంపుదల అనేది చాలా ఏళ్ల తరువాత జరుగుతున్న ప్రక్రియ. మధ్యతరగతి, పేదల అభిమానం రైళ్లపై ఎంతో ఎక్కువగా ఉంటుంది. కానీ ధరల పెరుగుదలతో రైలులో ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారబోతోంది.
నివేదికల ప్రకారం, నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ధర ప్రతి కిలోమీటరుకు 1 పైసా పెరగనుంది. ఏసీ తరగతికి చెందిన టికెట్ ధర ప్రతి కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనుంది. ఛార్జీల పెంపు అన్నది పూర్తిగా సమానంగా అన్ని వర్గాల ప్రయాణికులపై వర్తించదు. సబర్బన్ రైలు టికెట్ ధరలు యథాతథంగా ఉంటాయి. రోజూ మెట్రో, పెద్ద పట్టణాల్లో రోజువారి ప్రయాణికులకు ఇది ఒక ఊరటనిచ్చే విషయం.

నెలవారీ సీజన్ టికెట్లు (MST) ధరల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవు. అంటే ఉద్యోగులు, విద్యార్థులు వంటి రోజూ రైల్లో వెళ్లే వారు అప్పటి తరహాలోనే ప్రయాణించవచ్చు. సాధారణ రెండవ తరగతి టికెట్ ధర 500 కి.మీ. వరకు ప్రయాణించే వారిపై ఛార్జీ పెంపు ప్రభావం ఉండదు. అంటే చిన్న దూర ప్రయాణికులకు భారం పడదు. ఆ తరువాత ప్రయాణించే వారిపై ధరల పెంపు ప్రభావం ఉంటుంది.
500 కి.మీ. దాటిన ప్రయాణాలపై రెండవ తరగతిలో కూడా కిలోమీటరుకు ఒక పైసా చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఈ ఛార్జీ పెంపు పెద్దగా సాధారణ ప్రయాణికుల బడ్జెట్‌ను దెబ్బతీయదని, ఇది మధ్య, ఎక్కువ దూరాలకు ప్రయాణించే ప్రయాణికులపై మాత్రమే స్వల్ప ప్రభావం చూపేలా ఉంటుందని రైల్వే అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఉదాహరణకు, 600 కి.మీ ప్రయాణించే వారిపై కేవలం 50 పైసల పెరుగుదల మాత్రమే కనిపిస్తుంది.

1,000 కి.మీలు ప్రయాణం చేసే వ్యక్తి ఇకపై రూ.2.50 ఎక్కువ చెల్లించాలి. అలాగే, ఎక్స్‌ప్రెస్, నాన్-ఏసీ మెయిల్ రైళ్లలో ప్రయాణించే వారికి కి.మీ.కు 1 పైసా ఛార్జీ పెరుగుతుంది. ఈ లెక్కన 1,000 కి.మీ ప్రయాణం చేసే వారు పెరిగిన ధరల ప్రకారం, రూ.10 ఎక్కువగా టికెట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారు కాస్త అధికంగానే చెల్లించాలి.
భారతీయ రైల్వేలు ఎంతో కాలం తర్వాత టికెట్ ఛార్జీలను సవరించడమే కాదు, పలు కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలు, టెక్నాలజీ డెవలప్‌మెంట్, సిస్టమ్‌లో పారదర్శకతను పెంచే ఉద్దేశంతో ఈ మార్పులను చేపడుతోంది. అందులో భాగంగా ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో కూడా కీలక మార్పులు చేసింది. తత్కాల్ టికెట్ అనేది ఆకస్మిక ప్రయాణాల కోసం ఎంతో మంది ఆధారపడే ఒక అత్యవసర టికెట్ సర్వీస్.

కానీ గతంలో, కొంతమంది టికెట్ ఏజెంట్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, రైల్వేలు ఇప్పుడు తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని ప్రకటించింది. ఈ టిక్కెట్లను వాస్తవ ప్రయాణికులే బుక్ చేయాలన్న ఉద్దేశంతో ఆధార్‌ను లింక్ చేయడం జరిగింది. జులై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.
మొత్తంగా రైల్వేలో రెండు కీలక మార్పులు జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఛార్జీల పెంపు అనేది భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక కొత్త అనుభవమే. అనేక సంవత్సరాలుగా ధరలు స్థిరంగా ఉండటంతో, పెద్దగా భారం లేకుండా ప్రయాణం చేయగలిగారు. కానీ ఇప్పుడు, నాన్-ఏసీ, ఏసీ టిక్కెట్లపై కిలోమీటర్‌కు పైసల చొప్పున చార్జీలు పెరగడం, ప్రయాణికుల్లో కొన్ని ఆందోళనలు కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications








