టోల్ ప్లాజాలపై కొత్త విధానం.. యాన్యువల్ టోల్ పాస్ వల్ల ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు నష్టమో తెలుసా ?
జాతీయ రహదారులపై వాహనదారులకు భారీ ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వార్షిక టోల్ పాస్ విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 3000 చెల్లించి సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా టోల్ ఫీజుల నుంచి మినహాయింపు పొందవచ్చన్న ఈ పథకం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.
అయితే, ఈ కొత్త విధానం వల్ల టోల్ వసూళ్లు తగ్గిపోయాయని, తద్వారా టోల్ ప్లాజాలను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీలకు భారీ నష్టం వస్తుందని, ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు చెల్లించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇది మన పన్నుల డబ్బు కదా! నిజంగా ఇంత పెద్ద నష్టం వస్తోందా? అసలు విషయం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రైవేట్, వాణిజ్యేతర వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్‌లు) ఈ వార్షిక టోల్ పాస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 3000 చెల్లించి పొందే ఈ పాస్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 1150 టోల్ ప్లాజాల గుండా సంవత్సరానికి 200 ట్రిప్పుల వరకు వెళ్లవచ్చు. అంటే ఒక్క ట్రిప్‌కి సుమారు రూ. 15 మాత్రమే ఖర్చవుతుంది.
ఇది తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఒకే మార్గంలో రాకపోకలు చేసే వారికి చాలా లాభదాయకం. కేవలం 5 రోజుల్లోనే 5 లక్షల మందికి పైగా ఈ పాస్‌ను కొనుగోలు చేశారంటే దీనికి ఎంత ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు.

టోల్ ప్లాజాలను నిర్వహించడానికి ప్రైవేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో బిడ్ వేసి దక్కించుకుంటాయి. ఈ బిడ్ విలువ వారు ఆ టోల్ ప్లాజాలో సేకరించగల మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వార్షిక పాస్ విధానం రావడం వల్ల వాహనదారులు ఒకేసారి రూ. 3000 చెల్లించడంతో, టోల్ ప్లాజా వద్ద వచ్చే రోజువారీ ఆదాయం తగ్గుతుంది.
ఉదాహరణకు, ఒక వాహనం సాధారణంగా టోల్ ఫీజు రూ. 100 చెల్లిస్తే, పాస్ ఉన్న వాహనం నుంచి రూ. 15 మాత్రమే టోల్ వసూలు అవుతుంది. మిగిలిన రూ. 85 ఆపరేటర్‌కు నష్టం కదా? ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఆపరేటర్లకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ వార్షిక పాస్ విధానం కొత్తగా ప్రవేశపెట్టబడింది కాబట్టి, ప్రస్తుత కాంట్రాక్టులలో ఈ అంశం లేదు. అందుకే తొలి మూడు నెలల వరకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించింది. ప్రతి రోజూ వార్షిక పాస్‌తో వెళ్లే వాహనాల సంఖ్యను NBCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పోర్టల్ ద్వారా లెక్కించి, వాటి ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని లెక్క కడతారు.
ఆ మొత్తాన్ని టోల్ కంపెనీలకు నష్టపరిహారంగా చెల్లిస్తారు. అంటే, ఒక వాహనం పాస్ లేకుండా ప్రయాణిస్తే ఎంత చెల్లించాల్సి ఉండేదో లెక్కించి, ఆ మొత్తాన్ని టోల్ కంపెనీకి చెల్లిస్తారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ నష్టపరిహారం సుమారు రూ. 4200 నుండి రూ. 4500 కోట్ల వరకు ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారులపై మొత్తం టోల్ ఆదాయంలో వ్యక్తిగత వాహనాల వాటా 35-40 శాతం వరకు ఉంది. ఈ పాస్ వల్ల ఈ ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఈ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించాల్సి వస్తుందని అంచనా.
ఈ నష్టపరిహార విధానం కేవలం ప్రస్తుత కాంట్రాక్టులకు మాత్రమే వర్తిస్తుంది. మూడు నెలల తర్వాత కొత్తగా వేసే బిడ్‌లలో ఈ వార్షిక పాస్ విధానాన్ని కూడా కాంట్రాక్టు నిబంధనల్లో చేర్చనున్నారు. ఆ తర్వాత టోల్ కంపెనీలు ఈ పాస్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని బిడ్ వేస్తాయి. అప్పుడు ఈ నష్టపరిహారం అవసరం ఉండదు.
ఇది వాహనదారులకు మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి కూడా టోల్ వసూళ్ల ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తుంది. ఈ విధానం ప్రజలకు లభించే ప్రయోజనాలతో పోలిస్తే, ప్రస్తుతానికి ప్రభుత్వానికి కొంత ఆర్థిక భారం ఉన్నా, దీర్ఘకాలంలో ఇది ఒక మంచి మార్పు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవ్ స్పార్క్ కామెంట్: భారతదేశంలో వాహనదారులకు ఎప్పటి నుంచో టోల్ ఫీజుల గురించి తీవ్ర ఆందోళన ఉంది. ఈ వార్షిక పాస్ వ్యవస్థ వారి కష్టాలను తగ్గించడానికి ఒక మంచి అవకాశం. ఇది ఖచ్చితంగా ప్రజలను సంతోషపరిచింది. భవిష్యత్తులో దీనిని ఉపయోగించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరహా పాస్ వ్యవస్థను వాణిజ్య వాహనాలకు కూడా అమలు చేస్తే మరింత మంచి స్పందన లభిస్తుంది.


Click it and Unblock the Notifications








