Bharatiya Antariksh Station 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రం'.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన
భారత తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష కేంద్రానికి 'భారతీయ అంతరిక్ష స్టేషన్ అని పేరు పెట్టామని ఆయన అన్నారు. 2035 నాటికి ఈ స్పేస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భారత్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సూర్యుడిపై ప్రయోగించిన మిషన్ ఆదిత్య L-1 ప్రాజెక్టు కూడా విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి సంబంధించి కీలక సమాచారం వెల్లడైంది.

బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ కార్తీ చిదంబరం అడిగిన ప్రశ్నకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం సమర్పించారు. ఇందులో ఇస్రోకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ గురించి వెల్లడించారు. ఇతర దేశాలకు పోటీగా ఇస్రో కూడా అంతరిక్షంలో సొంత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని యోచిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
2035 నాటికి భారతదేశం అంతరిక్షంలో పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాలని యోచిస్తోందని, అందుకోసం ఇస్రో(ISRO) తన పనిని ప్రారంభించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి 'Bharatiya Antariksh Station' అని పేరు పెట్టిందని ఆయన తన లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించిన పనులను దశలవారీగా విభజించి త్వరలోనే పూర్తి ప్రాజెక్టు నివేదికలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. 'భారతీయ అంతరిక్ష కేంద్రం' అనేది భారతదేశం కోసం ప్రత్యేకంగా ఇస్రో అభివృద్ధి చేసిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంగా నిలవనుంది. దీనిని ఇస్రో అభివృద్ధి చేస్తుంది. 2035 నాటికి పూర్తయి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ డిజైన్‌లో మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే మార్గాలు, అనుసరించాల్సిన పద్ధతులు ఇలా అనేక వాటిపై విశ్లేషణ చేయనున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు మరియు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రణాళికల తర్వాత మాత్రమే పూర్తి సమాచారం బయటకు వస్తుంది.
భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించలేదు. ఇందుకు తగిన అధ్యయనాలు నిర్వహించి ప్రణాళిక రూపొందించి ఖర్చు చేయవచ్చని శాస్త్రవేత్తలు నిర్ణయించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపి లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే దీనికి నిధులు కేటాయించనున్నారు.
ప్రస్తుతం ఇస్రో(ISRO Bharatiya Antariksh Station) ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అవకాశాలను అధ్యయనం చేయడంతో పాటు చంద్రుడిపైకి రోబోలను పంపే ప్రణాళికను కూడా అధ్యయనం చేస్తోంది. తద్వారా భూమి నుంచి చంద్రుడిపైకి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ పంపి అక్కడి నుంచి శాంపిల్స్ సేకరించి ఆ తర్వాత చంద్ర మండలంపై నుంచి శాంపిళ్లతో సురక్షితంగా భూమికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కాగా ఇప్పటి వరకు గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 400 కి.మీ ఎత్తుకు మనుషులను తీసుకెళ్లి అక్కడ పరిశోధనలు నిర్వహించి మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి చేర్చడమే గగన్‌యాన్ ప్రాజెక్ట్ లక్ష్యం.
మొదటి దశ ప్రాజెక్టు విజయవంతమైందని, త్వరలోనే రెండో దశ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రెండు దశల పరీక్షలు పూర్తయిన తర్వాత, గగన్‌యాన్ ప్రాజెక్ట్ 2025 ప్రారంభం నాటికి పూర్తవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications








