స్క్రాప్ మెటీరియల్‌తో తయారైన ఈ అంబాసిడర్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. గురూ..!!
ఒక కళాకారుడు తన కళ్ళతో చూడాలే గానీ.. ఏదైనా అద్భుతాలు చూడగలడు, సృష్టించగలడు. ఎంతో మంది కళాకారులు తమ కళను ప్రదర్శించి ఎన్నో అద్భుతాలు చేసిన విషయాలను గురించి ఇది వరకు చాలానే తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ఇండోర్ కి చెందిన ఒక కళాకారుడు ఒక అద్భుత సృష్టిని చేసి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కు చెందిన 'సుందర్ గుర్జార్' ఒక పాత అంబాసిడర్ కారును కేవలం స్క్రాప్ మెటీరియల్‌తో చూడచక్కగా తయారు చేసాడు. ఇది చూడటానికి ఒక రోబోలాగా కనిపిస్తుంది.

సుందర్ గుర్జార్ మొత్తం ఈ కారు కోసం 1,000 కేజీల స్క్రాప్ మెటీరియల్‌ని ఉపయోగించాడు. ఇప్పుడు ఈ కారు పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. మొత్తం కారు చుట్టూ 700 కేజీల బోల్టులు, 400 కేజీల చైన్‌లతో పాటు మిగతా విడి భాగాలను అమర్చారు. ఈ అందమైన అంబాసిడర్ కారుని తయారు చేయడానికి మొత్తం 3 నెలలు సమయం పట్టిందని ఆయన అన్నారు.

హిందుస్తాన్ మోటార్స్ కంపెనీ యొక్క అంబాసిడర్ కారు ఒకప్పటి నుంచి కూడా ఎక్కువ ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ రోజుకి కూడా దీనిపైన వాహనప్రియులకు ఉన్న ప్రేమ తగ్గలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కార్ మార్కెట్ ని ఒకప్పుడు శాశించిన అంబాసిడర్ కారు యొక్క ఉత్పత్తి 2014 లో నిలిపివేయబడింది.

కొన్ని దశాబ్దాల పాటు వాహన మార్కెట్ ని శాసించిన అంబాసిడర్ కారు, ఇప్పుడు చాలా చోట్ల దుమ్ముపట్టి దర్శనమిస్తాయి, మరి కొన్ని వాహనాలను వినియోగదారులు ఇప్పటికి కూడా వినియోగిస్తున్నారు. భారతదేశంలో స్క్రాపింగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత పాత కార్లన్నీ కూడా మరుగునపడిపోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే ఈ కార్లు చాలా వరకు అంతరించిపోతున్నాయి.

అయితే మీకు ఇక్కడ చూస్తున్న అరుదైన ఈ కారు పూర్తిగా స్క్రాప్ తోనే తయారుచేయబడింది. అయితే దీని తయారీలో మాత్రం మన ఆర్టిస్ట్ యొక్క అద్భుత ప్రతిభ కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. అయితే ఆ కారు యొక్క రూపానికి ఏ మాత్రం ఆటంకం కలగకుండా ఇనుప వ్యర్థాలన్నీ సరైన విధంగా అతుక్కునేలా చేసాడు.

సుందర్ గుర్జార్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసాడు, ఇప్పటికే యితడు చాలా వస్తువులను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అయితే ఇప్పుడు తయారైన ఈ అంబాసిడర్ కారు పాతరోజుల దర్జాను గుర్తుకు తెస్తోంది. తెల్లగా ఎంతో దర్జాగా కనిపించే ఈ కారు ఇప్పుడు ఇనుప చైన్లతో ఒక రోబో లాగా కనిపిస్తోంది. ఇది చూసిన చాలామంది ప్రజలు మన ఆర్టిస్ట్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
NOTE: ఇక్కడ ఉపయోగించిన మొదటి మూడు ఫోటోలు కాకుండా, మిగిలిన చిత్రాలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే


Click it and Unblock the Notifications








