త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఇండిగోకు మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ త్వరలో భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ (Electric Air Taxi) సర్వీస్‌ను ప్రారంభించబోతుందని సమాచారం. ఈ సర్వీస్ ఎప్పుడు అమల్లోకి రానుంది.. ఛార్జీలు ఎంత ఉంటాయి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఇటీవల ఎక్కువగా వినపడుతున్న పేరు ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీ(Flying Air Taxi). ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు.. త్వరలో భారత్‌లో ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ 2026 నాటికి భారతదేశంలో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను తీసుకురానున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌లో ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు.. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, మెట్రో సర్వీస్‌లను తీసుకువస్తున్నాయి. అయినప్పటికీ బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య నిరంతరం వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీ ద్వారా.. రద్దీ నగరాల్లో ఇది చాలా వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఉదాహరణకు ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కి రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి 1 గంట 41 నిమిషాల సమయం తీసుకుంటే, ఈ ఫ్లయింగ్ టాక్సీ ద్వారా మిమ్మల్ని 7 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. భారతదేశంలో ఫ్లయింగ్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు ఇంటర్‌గ్లోబ్ ఆర్చర్ ఏవియేషన్(Interglobe Archer Aviation)తో భాగస్వామ్యం కలిగి ఉండటం గమనించదగ్గ విషయం.

ఆర్చర్ ఏవియేషన్ ప్రముఖ ఫ్లయింగ్ వాహన తయారీ సంస్థ. వీరంతా కలిసి భారత్ కోసం ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీలను సిద్ధం చేస్తున్నారు. ఈ టాక్సీలు ఎగరడానికి రన్‌వే మరియు విమానాల వంటి ల్యాండింగ్ ప్యాడ్ అవసరం లేదని చెప్పారు. నివేదికల ప్రకారం, వాహనం నిలబడి ఉన్న స్థానం నుండి గాలిలోకి
నిలువుగా పైకి లేవగలదు. అందుకోసం హెలికాప్టర్ పనిచేస్తుందని సమాచారం.
అదే సమయంలో, ఇది పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది కాబట్టి శబ్దం స్థాయి తక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఆర్చర్ ఏవియేషన్ మొత్తం 200 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. తొలి దశలో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలను రాజధాని నగరం ఢిల్లీలోనే ప్రయోగించనున్నారు.

దీని తరువాత, ఇంటర్‌గ్లోబ్ యొక్క ఫ్లయింగ్ టాక్సీ సేవలు ముంబయి మరియు బెంగళూరు వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2026 నాటికి భారతదేశంలోని వివిధ ప్రధాన నగరాల గగనతలంలో ఎగిరే ట్యాక్సీలు తిరుగుతాయని ఊహించవచ్చు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలలో ఒక్కోదానికి ఆరు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఈ ఎయిర్ ట్యాక్సీల్లో ఐదు సీట్లు ఉంటాయని సంస్థ చెబుతోంది. పూర్తి ఛార్జింగ్‌కు 30-40 నిమిషాలు పడుతుందని.. ఒక నిమిషం ఛార్జింగ్‌తో ఒక నిమిషం ప్రయాణించవచ్చని వెల్లడించింది. అంటే మొత్తం ఛార్జింగ్‌తో 30, 40 కి.మీ. ప్రయాణించే అవకాశాలున్నట్లు ఆర్చర్ ఏవియేషన్ పేర్కొంది.

ఈ ఫ్లయింగ్ టాక్సీలో ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. కన్నాట్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ మధ్య 7 నిమిషాల ప్రయాణానికి ఛార్జీ రూ.2000- 3000 వరకు ఉండొచ్చని సమాచారం తమ విమానానికి సర్టిఫికేషన్ ప్రక్రియ తుది దశల్లో ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ గోల్డ్ స్టీన్ వివరించారు.


Click it and Unblock the Notifications








