ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఇక మీదట అది లేని పెట్రోల్ అమ్మరట.. రైతులకు ఇక పండగే పండగ!
దేశంలో ఇథనాల్ పెట్రోల్‌పై అనేక ఆరోపణలు, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇందులో నిజం ఎంత? మీ వాహనంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే నష్టం జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఇందులో నిజం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తాము ఇకపై ఇథనాల్ కలపని పెట్రోల్ విక్రయించమని ప్రకటించింది. ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల వాహనానికి ఎలాంటి నష్టం జరుగుతుందని ఇప్పటివరకు ఏ నివేదిక కూడా వెలువడలేదు.

ఇథనాల్ పెట్రోల్ వల్ల లాభాలు
E20 పెట్రోల్ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలను 20 నుండి 50 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వల్ల గాలి క్వాలిటీ మెరుగుపడుతుంది. మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే.., భారతదేశం 85 శాతం కంటే ఎక్కువ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయి.
అంతేకాకుండా, చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి ఇథనాల్ తయారు చేస్తారు. దీని కారణంగా రైతులకు తమ పంటలకు, వ్యర్థాలకు మంచి ధర లభిస్తుంది. తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. రైతులకు కొంత ప్రోత్సాహం లభిస్తుంది.
ఇథనాల్ పెట్రోల్‌తో నష్టాలు ఉన్నాయా?
ఇథనాల్ పెట్రోల్ వల్ల లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. పాత వాహనాలలో 20% వరకు ఇథనాల్ మిశ్రమాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంజిన్, గాస్కెట్‌లు, ఇంధన వ్యవస్థ దెబ్బతింటాయని కొందరు వాహన యజమానులు, తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంధనంలో ఇథనాల్ శాతం ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా 25 శాతం కంటే ఎక్కువ ఉంటే అది ఇంజిన్ కెపాసిటీ, ఇంధన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, E20కి అనుకూలంగా లేని పాత వాహనాలకు ఇథనాల్ లక్షణాల వల్ల కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఇది తేమను గ్రహించడం ద్వారా ఇంధన ట్యాంకులు, సీల్‌లు, గాస్కెట్‌లు, ఫ్యూయల్ లైన్‌లను దెబ్బతీసే అవకాశం ఉందని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యాలు
ప్రస్తుతం కాలుష్యం సృష్టిస్తున్న కార్లను పూర్తిగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. వాహన్ డేటాబేస్ ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం 34.54 లక్షల ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా, స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలను వేగవంతం చేసే ప్రయత్నంలో ఉంది. ఈ కొత్త లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ E30 పెట్రోల్ను విడుదల చేయడానికి వ్యూహాలను పరిశీలిస్తోంది.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఆశించవచ్చు. నిర్ణీత సమయానికి ముందే ఇంధనంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అనే లక్ష్యాన్ని అధిగమించడం, సుస్థిర ఇంధనాల వైపు దేశం మళ్లుతుందని చూపిస్తుంది. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతంకి పెంచే ఈ ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తారా లేదా ఒకేసారి చేస్తారా అనేది ఇకపై చూడాలి.


Click it and Unblock the Notifications








