ISRO Aditya-L1 ఇస్రో మరో అరుదైన ఘనత.. లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య-ఎల్1 స్పేస్ క్రాఫ్ట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆదిత్య-L1(Aditya-L1) స్పేస్ క్రాఫ్ట్ టార్గెటెడ్ కక్ష్యలోకి చేరడంతో.. ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో శాస్త్రేవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3(Chandrayaan- 3) విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత.. ఇస్రో(ISRO) మరో అరుదైన ఘనత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతమై.. చివరి కక్ష్యలోకి ప్రవేశించి తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. భూమి నుంచి సూర్యుడి దిశలో 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ హాలో కక్ష్యలోకి ఆదిత్య౦-L1 ను ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

లగ్రాంజ్ పాయింట్(Lagrange Point) హాలో కక్ష్యలోకి చేరిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడి నుంచి సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ప్రయోగం విజయవంతమైందని ప్రధాని మోదీ ఎక్స్(గతంలో ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఆదిత్య ఎల్1 ప్రయోగంతో భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని మోదీ అన్నారు. ఇస్రో చేపట్టిన తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుందని తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో భారత సైంటిస్ట్‌ల అంకితభావానికి ఇది నిదర్శనమని వెల్లడించారు. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.

మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందని ప్రధాని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా అటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ కూడా దీనిపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ''మూన్ వాక్ నుంచి సన్ డ్యాన్స్ వరకు.! ఆదిత్య-ఎల్1 తుది కక్ష్యలోకి చేరుకుంది. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు'' అని ఆయన పేర్కొన్నారు.
కాగా ఆదిత్య L1 సోలార్ అబ్జర్వేటరీని 2022 సెప్టెంబర్‌లో ఇస్రో చేపట్టింది. జనవరి 6 న సాయంత్రం 4 గంటలకు లగ్రాంజ్ పాయింట్‌కు చేరుకుంటుందని ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ బలాలు సమతౌల్య స్థితికి చేరుకునే హాలో ప్రాంతం లగ్రాంజ్ పాయింట్.

సూర్యుని చుట్టూ వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే 'ఆదిత్య-ఎల్1' మిషన్ ప్రధాన లక్ష్యం. దేశం తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య-ఎల్1. ఈ ప్రాజెక్టును 2023 సెప్టెంబరు 2న శ్రీహరికోట వేదికగా చేపట్టారు. 63 నిమిషాల 20 సెకన్ల వ్యవధి తర్వాత ఆదిత్య-ఎల్1 ను భూమి చుట్టూ 235x19,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత వరుసగా కక్ష్యను పెంచారు. అనంతరం నేడు సాయంత్రం 4 గంటల సమయంలో సూర్యుడి లగ్రాంజ్ పాయింట్ 1(L1)కి ఆదిత్య-ఎల్1 విజయవంతంగా చేరుకుంది. ప్రయోగ సమయంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. విద్యుదయస్కాంత, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్‌లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని బయటి పొరలను పరిశీలించనున్నాయి. ప్రత్యేక వాన్టేజ్ పాయింట్ L1ని ఉపయోగించి, నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పర్యవేక్షించనున్నాయి.

కాగా మిగిలిన మూడు పేలోడ్‌లు లగ్రాంజ్ పాయింట్-L1 వద్ద అధ్యయనం చేయననున్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసి ఇవి కీలకమైన సమాచారాన్ని ఇక్కడికి చేరవేస్తాయి. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ విజయంతంతో ఇస్రో ఈ కొత్త సంవత్సరంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.


Click it and Unblock the Notifications








