Gaganyaan తొలి కీలక పరీక్ష విజయవంతం.. బంగాళాఖాతంలో దిగిన క్రూ మాడ్యుల్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ తొలిదశ టెస్టింగ్ విజయవంతం అయింది. 8 గంటలకు చేపట్టాల్సిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇస్రో.. అనంతరం ఉదయం 10 గంటలకు చేపట్టింది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా (Gaganyaan) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 8 గంటలకు చేపట్టాల్సిన టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ (TV-D1) ప్రయోగం ఆఖరి క్షణంలో నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రయోగ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. సమస్యను గుర్తించి, మరో ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే కొద్దిసేపటికే సమస్యను పరిష్కరించి విజయవంతంగా ప్రయోగించారు.

శ్రీహరికోట నుంచి రాకెట్ దూసుకెళ్లాక.. ఇస్రో సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు అబార్డ్ సిగ్నల్‌ను పంపించారు. దీంతో సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థ రాకెట్ నుంచి వేరు అయింది. అనంతరం 17 కిలోమీటర్ల ఎత్తు వద్ద క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ మాడ్యూల్ విడిపోయాయి.
ఈ దశ తర్వాత డ్రోన్ పారాచుట్లు తెరుచుకున్నాయి. వాటి సాయంతో క్రూ మాడ్యుల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో దిగింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఇండియన్ నేవీ బృందం క్రూ మాడ్యుల్‌ను సేకరించింది.

గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ 1 విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ (ISRO) వెల్లడించారు. తొలుత ఆఖరి క్షణంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి, సరిచేసినట్లు సోమనాథ్ ప్రకటించారు. క్రూ మాడ్యుల్ బంగాళాఖాతంలో దిగినట్లు చెప్పారు. శాస్త్రవేత్తలను అభినందించారు.
గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు తొలిపరీక్ష నిర్వహించాలని భావించారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి 7:30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. అయితే 8 గంటల సమయంలో వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో .. 8:45 నిమిషాలకు చేపట్టాలని భావించారు. అయితే చివరి క్షణంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయోగ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు.

క్రూ ఎస్కేప్ సిస్టమ్ : సొంతంగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలని ఇస్రో (ISRO- Gaganyaan) లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రయోగ సమయంలో రాకెట్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా, క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి వ్యోమగాములను క్షేమంగా భూమి మీదకు తీసుకొస్తారు. దీనిని క్రూ ఎస్కేప్ సిస్టమ్‌గా పిలుస్తున్నారు.
మొత్తం మూడు రకాల పరీక్షలు నిర్వహించి 2025 నాటికి గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. మానవ సహిత యాత్రలు చేయగల సత్తా భారత్ సొంతమని నిరూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశ విజయవంతం కావడంతో గగన్‌యాన్ ప్రాజెక్టు మరింత వేగంతో దూసుకెళ్లనుంది
3 రోజులపాటు అంతరిక్షంలో.. : గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడ వారు మూడు రోజలపాటు వివిధ రకాల పరిశోధనలు చేయనున్నారు. అనంతరం వారిని సురక్షితంగా భూమికి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన సన్నద్ధతను ఇస్రో పరీక్షిస్తోంది.
ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మినహా మిగిలిన ప్రాంతంలో రష్యా, అమెరికా, చైనా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.
చంద్రయాన్-3 ప్రయోగం అనంతరం ఇస్రో కీలక ఆదిత్య L1 ప్రాజెక్టు ప్రయోగించింది. ఇందులో భాగంగా భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న లాంగ్రాజ్ పాయింట్ నుంచి సూర్యుడి పరిస్థితులను నిశితంగా గమనించనుంది. ఇందులో భాగంగా 7 కీలక పేలోడ్‌లను పంపింది. జనవరి నాటికి ఆదిత్య L1.. లాంగ్రాజ్ పాయింట్‌కు చేరుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








