చంద్రయాన్-3ను ప్రయోగించిన ఇస్రో.. తొలిదశ విజయవంతం.. శాస్త్రవేత్తల సంబరాలు
భారత్ సహా యావత్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన చంద్రయాన్ -3ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ -3 ప్రయోగం నిర్వహించింది.
జులై 13 మధ్యాహ్నం 1.08 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలు రాకెట్‌ను కక్ష్యలోకి ప్రయోగించారు. ఈ రాకెట్ ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా పక్కా ప్లాన్ చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా ఇస్రో సిద్ధం చేసింది.

అయితే చంద్రయాన్-3లోని తొలి దశ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. LVM3-M4 రాకెట్ నుంచి చంద్రయాన్ వేరైందని.. నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని వెల్లడించింది. చంద్రుడి వైపు చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం అయిందని ఇస్రో డైరెక్టర్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. దీంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2019లో ప్రయోగించిన చంద్రయాన్2 కొన్ని సాంకేతిక కారణాలతో చంద్రుడిని రెండు మీటర్ల దూరం నుంచి అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన జాగ్రత్తలను ఇస్రో తీసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా కీలక సెన్సార్లు, కెమెరాలను అమర్చించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి ఉపరితలం మీదకు విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అంతా సిద్ధం చేశారు. ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి మీదకు దిగాక.. ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. సుమారు 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో సుమారు 630 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది.
చంద్రుడిపై ప్రయోగాలను 2008లో భారత్ ప్రారంభించింది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిని నీరు ఉనికి ఉందని తొలిసారిగా కనుగొంది. అనంతరం చంద్రుడి మీదకు ల్యాండర్ దించి చంద్రుని దక్షిణ ద్రువం పైన పరిశోధనలు చేయాలనేది చంద్రయాన్ మిషన్ ముఖ్య ఉద్దేశం.

ఇందుకోసం 2019 జులై 22న చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే అనుకున్న విధంగానే ఆర్పిటర్ విడిపోయింది. చంద్రుడిని కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ రెండు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి.
అయితే చంద్రుని ఉపరితలంపైకి ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా తమ ల్యాండర్లను పంపాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ను దించి, అక్కడ కీలక పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పనిచేసింది.

చంద్రుని యొక్క దక్షిణ ప్రాంతంలో వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడని ఎన్నో ప్రాంతాలున్నాయని ఇస్రో భావిస్తోంది. అలాంటి చోట ప్రయోగాలు నిర్వహించి విశ్వం పుట్టుగ యొక్క రహస్యాలు, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులు నివసించేందుకు గల అవకాశాలపై ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications








