బంగారాన్ని అమ్మి బంగారు మనసు చూపించాడు.. ఇలాంటి బాస్ ఉన్నాడంటే అసలు నమ్మలేరు!
ఎంతో కష్టపడి కంపెనీలు స్థాపించినప్పటికి అవి అభివృద్ధిలోకి రావాలంటే దానికి బలమైన బేస్ కావాలి. ఆ బేస్ ఎవరిదంటే.. ఉద్యోగులదే. వారు చేసిన కృషి, బాధ్యత, పనిలో నిబద్ధతే సంస్థను వృద్ధిలోకి తీసుకువస్తాయి. ఏడాది పొడవునా కంపెనీలో పనిచేసే వారికి జీతం తప్ప మరేమీ రాదు. ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా ఎంతోమంది సైలెంట్‌గా కష్టపడుతూ ఉంటారు. కొన్ని అరుదైన సందర్భాల్లో కొంతమంది యజమానులు తమ ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో పలువురు ఓనర్లు తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైక్స్ గిఫ్ట్‌లుగా ఇవ్వడం గురించి వార్తల్లో చదివాం. తాజాగా ఇటీవల గుజరాత్‌లో అలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లో ఓ ప్రముఖ నగల దుకాణ యజమాని ఉద్యోగులందరికీ విలాసవంతమైన బహుమతులు ఇచ్చాడు. తన కంపెనీ వృద్ధిలోకి రావడానికి ఎంతో కష్టపడిన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ రోజుల్లో పెద్ద కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు తమ సంపదను కార్లు, విలాసవంతమైన ఇళ్లతో ప్రదర్శించడంలోనే బిజీగా ఉంటారు. కంపెనీ వృద్ధి వెనుక అసలైన శక్తి ఎవరంటే.. రోజూ అవిశ్రాంతంగా పనిచేసే ఉద్యోగులే.

కొంతమంది కష్టపడి పనిచేసే ఉద్యోగుల గురించి పట్టించుకోరు. ఇది తప్పు అని భావించే నగల దుకాణ యజమాని, తన ఉద్యోగులు లేకుండా తాను ఎదగలేనని భావించి వారికి ఖరీదైన బహుమతులు ఇచ్చి ఉద్యోగుల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేశాడు. గుజరాత్‌కు చెందిన ఆ నగల వ్యాపారి పేరు కైలాష్ కాబ్రా. ఆయన స్థాపించిన కాబ్రా జ్యువెల్స్ ఇప్పుడు రూ.200 కోట్ల నికర విలువను కలిగిన సంస్థగా ఎదిగింది.
ఈ స్థాయికి చేరుకోవడంలో తనతో పాటు నడిచిన ఉద్యోగుల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబ్రా జ్యువెల్స్ ఇన్ని కోట్ల మైలు రాయికి చేరడంలో కీలక పాత్ర పోషించిన 12 మంది సీనియర్ ఉద్యోగులను ప్రత్యేకంగా గుర్తించి, వారిని సన్మానించారు. అది కూడా నోటి మాటలతో కాకుండా కార్ల రూపంలో. ప్రతి ఒక్కరికి ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి వారి మోహంలో సంతోషాన్ని నింపారు.

కాబ్రా జ్యువెల్స్‌లో పనిచేస్తు వృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఖరీదైన మహీంద్రా ఎక్స్‌యువీ700, టయోటా ఇన్నోవా, మారుతీ ఎర్టిగా, హ్యుందాయ్ ఐ10, హ్యుందాయ్ ఎక్సెంట్ సహా ఖరీదైన బహుమతులు ఇచ్చారు. అలాగే అత్యుత్తమ పనితీరు కనబరిచిన మరికొంతమంది బంగారం, వెండి నాణేలు, టూవీలర్స్, మొబైల్ ఫోన్లతో కూడిన హాలిడే ప్యాకేజీలను అందించారు. ఇవన్నీ కూడా ఉద్యోగుల పనితీరుకు నిదర్శనంగా అందించబడ్డాయి.
గుజరాత్‌లో కాబ్రా జ్యువెల్స్ ప్రముఖ నగల కంపెనీగా ఉంది. దీన్ని కైలాష్ కబ్రా తన 21 ఏళ్ల వయస్సులో కేవలం 12 మంది ఉద్యోగులతో మొదలుపెట్టాడు. తరువాతి కాలంలో ఉద్యోగుల మెరుగైన పనితీరు కారణంగా రూ.2 కోట్లుగా ఉన్న టర్నోవర్, భారీగా పెరిగి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 200 కోట్లను దాటింది. కేవలం 12 మందితో మొదలైన విజయ ప్రస్థానంలో ప్రస్తుతం మొత్తం ఉద్యోగుల సంఖ్య 140 మందికి చేరుకుంది.

ఈ సందర్భంగా కైలాష్ కబ్రా మాట్లాడుతూ, కంపెనీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది. ఇదంతా ఉద్యోగుల కష్టార్జితం, దీనికి నేను కృతజ్ఞుడను. వారి వల్లే ఈ రోజు కంపెనీ ఇంత ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈరోజు నా వ్యాపారం అభివృద్ధి చెందడానికి వారు రోజంతా కష్టపడేవారు. అందుకే వారు చేసిన కృషికి గుర్తింపుగా ఈ బహుమతులు ఇచ్చినట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications








