మీ వెహికల్ పేపర్స్ సరిగ్గా ఉన్నాయా..? ఒక్క రోజే రూ.6.92 లక్షల జరిమానాలను వసూలు చేసిన పోలీసులు!
మోటార్ వాహనాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చిన సదరు మోటార్ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు మీ వద్ద ఉండటం చాలా అవసరం. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడపటం చట్టరీత్యా నేరం. కాగా, గత రెండేళ్లుగా కరోనా తెచ్చిన పరిస్థితులు మరియు లాక్‌డౌన్‌ల కారణంగా కొన్ని పత్రాలను రెన్యువల్స్ విషయంలో వాహన యజమానులకు మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ ప్రకటించిన విషయం మనకు తెలిసినదే. అయితే, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా రోడ్డపైకి వస్తే, జరిమానా విధిస్తున్నారు.

ఇలా ఒక రాష్ట్రంలో కేవలం ఒక్క రోజులోనే దాదాపు ఏడు లక్షల రూపాయల జరిమానాలను విధించారు. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ రాష్ట్రంలోని ట్రాఫిక్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాలలో వీరు ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇలా ఒక్క రోజులో మొత్తం 235 వాహనాలు సరైన పత్రాలు లేకుండా రోడ్డుపై తిరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఆ రోజు రూ.6.95 లక్షల మొత్తాన్నిజరిమానా రూపంలో వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.

ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో 65 వాణిజ్య వాహనాలతో పాటుగా మొత్తం 235 వాహనాలకు సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. పన్ను చెల్లింపులో అవకతవకలు, అధిక లోడ్, కాలుష్య ధృవీకరణ లేకపోవడం తదితర కారణాలతో సదరు వాహనాలకు జరిమానా విధించారు. ఒక్కరోజులో మొత్తం రూ.6,92,765 జరిమానాలను వసూలు చేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 3 వాణిజ్య వాహనాలను సీజ్ కూడా చేశారు. రాంచీ ప్రాంతంలో ఆవుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతూ, ఆవులను దొంగిలిస్తున్నారు.

ఈ ఆవు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రత్యేక సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు గత శనివారం 10 వేల మంది పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ డ్రైవ్ నిర్వహించారు. కరోనా కాలంలో వాణిజ్య మరియు పాఠశాల వాహనాలు పనిచేయనందున వాటికి పన్ను మినహాయింపులు అందించారు. అయితే, ఇప్పుడు అన్ని వాహనాలకు తప్పనిసరిగా అన్ని అవసరమైన ట్రాఫిక్ పత్రాలు ఉండటం తప్పనిసరి చేయబడింది.

భారతదేశం అంతటా ప్రతిరోజూ లక్షలాది వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. భారతదేశంలో రోడ్లపై వాహనాలు నడపడం కోసం కొన్ని చట్టపరమైన అనుమతులు మరియు పేపర్లు అవసరం. దీని ప్రకారం సరైన అనుమతితో వాహనాలు నడపాల్సి ఉంటుంది. కానీ, కొందరు తమ వాహనాలను సరైన పత్రాలు లేకుండానే నడిపేస్తున్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అధికారులు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తున్నప్పటికీ, చాలా మంది తెలివిగా తప్పించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల నెంబర్ ప్లేట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాహన యజమానులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల నెంబర్ల ప్లేట్లను ఉపయోగిస్తూ, నంబర్ ప్లేట్ టాంపరింగ్ కి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో, సీటీ ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్‌లను టాంపిరింగ్ చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చాలా మంది వాహన యజమానులు నెంబర్ ప్లేట్ లేకుండానే రోడ్లపై తిరగడం మరియు ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గత వారం నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ ఇప్పటికే 100 మందికి పైగా వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాహనాల నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్ లేకుండా నడపడం, నంబర్ కన్పించకుండా చేయడం, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా తాత్కాలిక నంబర్‌తోనే వాహనాలపై తిరుగుతూ ఉండటం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనలను ఈ డ్రైవ్ లో గుర్తించారు. వాహనం ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉంటుందో వారే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నేరస్థులు కూడా ఇలా నంబర్ ప్లేట్ లేకుండా లేదా ట్యాంపర్ చేయబడిన నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలపై ప్రయాణించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా నంబర్ ప్లేట్ లేకుండా కొందరు వాహనాలు నడుపుతూ కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడుతున్నారని ట్రాఫిక్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్ తీసేయడం, నెంబర్ కనిపించకుండా చేయడం, నెంబర్ ప్రింట్ ను తుడిచి వేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తామని, ఇలాంటి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ తెలిపారు.

వాహన షోరూమ్ ల నుండి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాన్ని నెల రోజుల పాటు తాత్కాలిక నంబర్‌తో నడపవచ్చు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే సదరు వాహన యజమాని తన వానాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, ఆ తరువాత జరిమానాతో కూడిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీవోలో విధించే ఈ జరిమానా చాలా చిన్న మొత్తంగా ఉండటంతో, వాహన చాలకులు దీన్ని ఆసరాగా చేసుకొని తాత్కాలిక నంబర్ ప్లేట్‌తోనే రోడ్లపై తిరుగుతున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ, నంబర్ ప్లేట్లు వాహనానికి అమర్చుకోకుండా తిరుగుతున్నారు.


Click it and Unblock the Notifications








