జూ. ఎన్టీఆర్ కారుకి కొత్త హంగులు.. ఈ దేవర కారు ధరెంతో తెలుసా!
ఇండియన్ మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ లగ్జరీ కారు విడుదల అయిందంటే వెంటనే సెలబ్రిటీలు వాటిని కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ఈ జాబితాలో టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ముందు వరుసలో ఉంటారు. ఆయన ఇటీవల మెర్సిడెస్-బెంజ్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ కారును తన కార్ల లిస్ట్‌లో చేర్చుకున్నారు. ఈ కొత్త మోడల్ పేరు 'మేబ్యాక్ S580(Maybach S580)'. దీన్ని ఇదే ఏడాది ఏప్రిల్‌లో కొనుగోలు చేయగా, దానిలో కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇటీవల ఈ విలాసవంతమైన కారు డెలివరీని అందుకున్నారు. దీని ధర రూ.2.7 కోట్లు. ఇది సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ మేబ్యాక్ కొత్త మోడ్‌లకు సంబంధించిన వీడియోను సెరామిక్ ప్రో ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది . సిరామిక్ ప్రో హైదరాబాద్ వర్క్‌షాప్ నుండి ఇది బయటకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. దీని ముందు భాగంలో గ్రిల్ మొత్తం బ్లాక్ కలర్‌లో ఉంది. ముఖ్యంగా దీని అప్‌డేట్‌లలో అల్లాయ్ వీల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ మేబ్యాక్ S580ను వోసెన్ అల్లాయ్ వీల్స్‌తో సరికొత్తగా అప్‌డేట్ చేయించారు. వోసెన్ అల్లాయ్ వీల్స్ ఈ లగ్జరీ కారుకు మరింత విలాసవంతమైన రూపాన్ని అందిస్తాయి. దీని కోసం దాదాపు రూ. 2.17 లక్షలు ఖర్చు చేశారు. దీంతో పాటు లోపల ఇంటీరియర్‌లో ఏవైనా మార్పులు చేశారా లేదా అనే వివరాల గురించి సమాచారం వెల్లడికాలేదు. చూడటానికి స్టైలీష్ లుక్‌తో ఉన్న కారులో లేటెస్ట్ ఫీచర్లను అందించారు.
మేబ్యాక్ S580ను జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్‌లో కొనుగోలు చేయగా, దాని రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఓ కార్యాలయానికి గతంలో వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తన అభిరుచులకు అనుగుణంగా కారులో కొన్ని మార్పులు చేయడానికి ఒక సంస్థకు అప్పగించగా, తాజాగా అన్ని పూర్తయిన తర్వాత డెలివరీ తీసుకున్నారు.

ఈ మేబ్యాక్ S580 కారు చాలా లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంది. కారులో మసాజ్ తరహా, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఇది 4.0-లీటర్ బిటర్బో V8 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ మోటారుతో వస్తుంది. 496 bhp వద్ద 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.
కారులో పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైట్లు, మెర్సిడెస్ MPUX టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే, కారు ఇన్-కార్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ప్రయాణ సమయంలో చాలా కంఫర్ట్‌గా విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్: వరుస సుపర్ హిట్ సినిమాలతో తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ గ్యారేజీలో ఈ కొత్త మేబ్యాక్ S580 మాత్రమే కాకుండా చాలా కార్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఐయోనిక్ 5(Ioniq 5) ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌ను కూడా గతంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం లభించలేదు.
హ్యుందాయ్ నుండి వచ్చిన ఐయోనిక్ 5 వెనుక-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది గరిష్టంగా 215 bhp పవర్ వద్ద 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 631 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు లంబోర్ఘినికి చెందిన ఉరుస్ పెరల్ క్యాప్సూల్ ఎడిషన్(Lamborghini Urus Pearl Capsule Edition) కూడా ఆయన వద్ద ఉంది.
దీని ధర దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది. లంబోర్ఘిని ఉరుస్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో వస్తుంది. ఇది 650 PS వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వద్ద బ్లాక్ పోర్స్చే 718 కేమాన్(black Porsche 718 Cayman), Mercedes-Benz GLS SUV, రేంజ్ రోవర్ వోగ్(Range Rover Vogue), పాత తరం BMW 7 సిరీస్ కార్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








