లోకనాయకుడి తొలి ప్రతాపం.. పెట్రోల్, అణు ప్రాజెక్టులపై కేంద్రాన్ని వణికించిన కమల్!
విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ వెండితెరపైనే కాదు, పార్లమెంట్‌లోనూ తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. గత జూలైలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్, ఈ వారంలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తన తొలి ప్రశ్నలను సంధించారు. ప్రజా సమస్యల పట్ల తనకున్న అవగాహనను చాటుకుంటూ, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇంధన మార్పులు (E20 పెట్రోల్), అణు విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వాన్ని రాతపూర్వక ప్రశ్నలతో నిలదీశారు.
కమల్ హాసన్ ప్రధానంగా వాహనదారులను వేధిస్తున్న పెట్రోల్ ధరలు, క్వాలిటీపై దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయా? అని ప్రశ్నించారు. మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్ పార్ట్స్ పాడైపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వం ఏదైనా లోతైన అధ్యయనం చేసిందా? అని అడిగారు.

అలాగే, అందరికీ అందుబాటులో ఉన్న E10 పెట్రోల్‌ను ఎందుకు నిలిపివేశారో వివరణ కోరారు. ఇథనాల్ వాడకం వల్ల వాహనాలకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ లేదా వారంటీ కవరేజ్ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
దీనికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వంటి సంస్థలు అనేక ప్రయోగాలు చేశాయని, E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలకు కూడా ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
వాహనం స్టార్ట్ అవ్వడంలో గానీ, నడపడంలో గానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని, మైలేజ్ అనేది కేవలం పెట్రోల్ మీద మాత్రమే కాకుండా డ్రైవింగ్ అలవాట్లు, కారు మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుందని గడ్కరీ బదులిచ్చారు.

మరోవైపు, దేశ భవిష్యత్తుకు కీలకమైన అణు విద్యుత్ ప్రాజెక్టులపై కూడా కమల్ తన గళం వినిపించారు. భారత్‌లో అపారంగా ఉన్న థోరియం నిల్వలను ఎలా వినియోగించుకోబోతున్నారని ప్రశ్నించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల నుండి 100 గిగావాట్లకు ఎలా పెంచుతారు? అని అడిగారు.
ముఖ్యంగా తమిళనాడులోని కల్పక్కంలో నిర్మిస్తున్న అదనపు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల (FBR) స్థితిగతులు ఏమిటి? స్థానిక ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. 2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. 2031 నాటికి 22 గిగావాట్లకు చేరుకుంటామని, అందులో 54 గిగావాట్లు ఒక్క న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) ద్వారానే సాధిస్తామని చెప్పారు.
భారత్‌లో యురేనియం తక్కువగా ఉన్నందున, థోరియంను వినియోగించుకునే త్రీ-స్టేజ్ అణు కార్యక్రమం చాలా ముఖ్యమని వివరించారు. కల్పక్కంలో స్థానిక ప్రజలకు అణు విద్యుత్ వల్ల కలిగే ప్రయోజనాలు, భద్రత గురించి సీఎస్ఆర్ (CSR) కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తొలిసారిగా రాజ్యసభలో ప్రశ్నలు అడిగిన కమల్, సెలక్టివ్ గా కాకుండా టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టడం అందరినీ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications








