ఈ స్పీడ్ దాటితే ఆరు నెలలు జైలుకే! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ / మితిమీరిన వేగం. దీనిని అరికట్టడానికి కర్ణాటక పోలీసులు ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానం ప్రకారం 2024 ఆగష్టు 1 నుంచి రాష్ట్రంలోని ఏ రోడ్డుపై అయినా 130 కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నియమాలను అతిక్రమిస్తే.. రూ. 1000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కర్ణాటకలో అమలుకానున్న ఈ కొత్త రూల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ సమస్యను తగ్గించడానికి కర్ణాటక పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలకు చాలా వరకు అతివేగం కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో 90శాతం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని.. పోలీసులు ఈ కొత్త విధానానికి తెరతీశారు.

ఆగష్టు 1నుంచి కర్ణాటకలో ఏ వాహనదారుడైన గంటకు 130 కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే వారికి తగిన శాస్తి జరుగుతుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రూల్స్ అతిక్రమిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి వాహనదారులు జాగరూకగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది తప్పకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.
2024 జులై 25న బెంగళూరు మైసూరు హైవేలో స్పీడ్ కెమెరాలు వేగ పరిమితిని ఉల్లంఘించిన సుమారు 155 వాహనాలను క్యాప్చర్ చేసినట్లు గుర్తించాయని పోలీసులు వెల్లడించారు. ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వేగా పరిమితిని ఉల్లంఘించిన వాహనాల జాబితాలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సు కూడా ఉంది. ఈ బస్సు 140 కిమీ/గం వేగంతో వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం వేగపరిమితులు 130 కిమీ/గం వరకు మాత్రమే ఉన్నాయి. అంటే గంటకు 130 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఎవరూ ప్రయాణించకూడదు. ఇప్పటికే కర్ణాటకలో అనేక రహదారుల్లో వేగపరిమితులు నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో తప్పకుండా తక్కువ వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. బెంగళూరు-మైసూర్ హైవే మీద వేగం గంటకు 100 కిమీ మాత్రమే. అదే విధంగా బెంగళూరు-పూణే రహదారిపై వేగం గంటకు 40 నుంచి 80 కిమీ మాత్రమే.
కర్ణాటక పోలీసులు ఈ ఓవర్ స్పీడ్ విధానం తగ్గించడానికి ఆధునిక టెక్నాలజీలను వాడుతున్నారు. ఇందులో భాగంగానే కీలకమైన రహదారులపైన లేటెస్ట్ స్పీడ్ లేజర్ గన్‌లను అమర్చారు. ఇవి వాహనాల వేగాన్ని 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో కూడా వాహనాల వేగాన్ని ఖచ్చితంగా రికార్డ్ చేస్తాయి. వీటితో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి.
వేగంగా వెళ్లే వాహనాల యొక్క ఫోటోలను, వాటి వేగానికి సంబంధించిన వివరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు ఫోటో తీస్తాయి. వీటి ఆధారంగా నియమాలను అతిక్రమించిన వాహనదారుల మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 155 స్పీడ్ లేజర్ గన్‌లను అమర్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను పెంచనున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








