కోట్ల ఆస్తి ఉన్నా కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ గ్యారేజీలో ఆ పాత కారు ఎందుకుందో తెలుసా ?
Karnataka CM : కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. తీవ్ర రాజకీయ ఉత్కంఠ మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిద్ధరామయ్య రాజీనామాతో ఇప్పుడు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే తదుపరి సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ఈ భారీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరైన డీకే శివకుమార్ వ్యక్తిగత జీవితం, ఆయన ఆస్తుల వివరాలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్‌కు ఏకంగా రూ.1,413 కోట్లకు పైగా ఆస్తి ఉంది. అయితే, ఇంతటి అపర కుబేరుడైన ఈ లీడర్ దగ్గర కేవలం ఒకే ఒక్క సొంత కారు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
డీకే శివకుమార్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట కేవలం ఒకే ఒక్క కారు రిజిస్టర్ అయి ఉంది. అది కూడా ఈ తరం మోడ్రన్ లగ్జరీ కార్లయిన బెంజ్, ఆడి, ఫెరారీ లాంటివి కావు. దాదాపు 24 ఏళ్ల క్రితం, అంటే 2002వ సంవత్సరంలో ఆయన కొనుగోలు చేసిన ఒక పాత టయోటా క్వాలిస్ కారు. అప్పట్లో ఈ ఐకానిక్ ఎస్‌యూవీ అంచనా విలువ రూ.8.35 లక్షలుగా ఉంది.

సాధారణంగా భారతదేశంలో ఏ కారునైనా గరిష్టంగా 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం రోడ్లపై తిప్పడానికి నిబంధనలు అంగీకరించవు. కాబట్టి శివకుమార్ ఈ కారును ప్రస్తుతం వాడుతుండే అవకాశం లేదు. కానీ, తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా భావించే తన మొదటి కారును ఇప్పటికీ గ్యారేజీలో ఎంతో అపురూపంగా భద్రపరుచుకోవడం విశేషం.
అసలు టయోటా క్వాలిస్ అంత స్పెషల్ ఎందుకు?
భారతదేశంలో టయోటా కంపెనీ సామ్రాజ్యానికి పునాది వేసిన కారు ఈ క్వాలిస్. టయోటా, కిర్లోస్కర్ గ్రూప్ జాయింట్ వెంచర్ కింద ఈ కారు 2000 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైంది. ఆ రోజుల్లో టాటా సుమో, మహీంద్రా బొలెరో వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇస్తూ రంగంలోకి దిగింది.
ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. దీని పవర్‌ఫుల్ ఇంజన్, అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, నమ్మకమైన పర్ఫార్మెన్స్ కారణంగా అతి తక్కువ కాలంలోనే పెద్ద కుటుంబాలకు, ట్రావెల్స్ ఆపరేటర్లకు ఇది మొదటి ఛాయిస్‌గా మారిపోయింది.

అప్పట్లో టయోటా క్వాలిస్ ప్రారంభ ధర కేవలం రూ.4.58 లక్షలుగా ఉండేది. ఇది ఎఫ్ఎస్, జిఎస్, జిఎస్‌టీ వేరియంట్లలో లభించేది. లాంచ్ అయిన మొదటి ఏడాదిలోనే ఈ కారు ఏకంగా 21 వేలకు పైగా యూనిట్లు అమ్ముడై, దేశీయ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకుంది.
ఐదేళ్ల కాలంలో దాదాపు 1.4 లక్షల కార్లు అమ్ముడై, పాపులారిటీ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే టయోటా ఈ కారును నిలిపివేసి దీని స్థానంలో మరింత మోడ్రన్ గా ఉండే ఇన్నోవాను తెచ్చింది. ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారుకు రూ.1.5 లక్షల నుండి రూ.2.5 లక్షల వరకు ధర పలుకుతోంది.


Click it and Unblock the Notifications