ఇక పెట్రోల్‌తో పనేలేదు, బైక్స్ అవసరమే లేదు.. ఈ రోబోట్ మనతో ముచ్చట్లు చెబుతుంది.. ఎక్కడికైనా తీసుకెళ్తుంది
ఇప్పటి వరకు మనం మనుషుల పనులు చేసే అనేక రోబోట్‌లను చూశాం.. కానీ జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ కవాసకి హెవీ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకు తెర లేపింది. ఈ కంపెనీ మోటార్‌సైకిళ్లను భర్తీ చేయగల ఒక వినూత్న రోబోట్‌ను రూపొందిస్తోంది. సింహం లాంటి ఆకృతిలో ఉండే ఈ రోబోట్‌ను నడపడం మోటార్‌సైకిల్, గుర్రాన్ని నడిపిన అనుభూతిని ఇస్తుంది. కంపెనీ దీనికి కోరలియో(Corleo) అని పేరు పెట్టింది. ఈ ఆలోచన ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కంపెనీ ప్రొజెక్ట్ మేనేజర్ తకాహిరో ఉయనో ధీమా వ్యక్తం చేస్తూ..2035 నాటికి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
కోరలియో రోబోట్‌ను తయారు చేయడానికి ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. మనుషులు నడుచుకుంటూ వెళ్లడం లేదా వాహనాలలో వెళ్లడం అసాధ్యమైన ప్రాంతాలకు చేరుకోవడం. ఉదాహరణకు ఎత్తైన పర్వత శిఖరాలు, దట్టమైన అడవులు, నదులు లేదా పెద్ద అడ్డంకులు దాటడం వంటి పనులను కోరలియో సులభంగా చేయగలదు.

ఈ రోబోట్‌లో అత్యంత ముఖ్యమైన ప్రయత్నం ఏమిటంటే, మనిషి, రోబోట్ మధ్య పూర్తి సమన్వయాన్ని తీసుకురావడం. దీనిపై ప్రయాణించే వ్యక్తి ఇచ్చే ఆదేశాలను ఇది ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ రోబోట్‌ను మోటార్‌సైకిల్ లాగా హ్యాండిల్ సహాయంతో లేదా గుర్రం లాగా కాళ్లలోని స్టిరప్‌ల సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.
కోరలియో రోబోట్ బరువు దాదాపు 200 కిలోలు ఉంటుంది. దీనిపై 100 కిలోల బరువు ఉన్న వ్యక్తి ప్రయాణించవచ్చు. అంటే సవారితో కలిపి మొత్తం 300 కిలోల బరువును ఇది సునాయాసంగా మోయగలదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది సాధారణ బ్యాటరీతో కాకుండా, హైడ్రోజన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇందులో నాలుగు హైడ్రోజన్ ట్యాంక్‌లు అమర్చబడి ఉంటాయి. ఇవి రోజంతా ప్రయాణానికి సరిపోతాయి. అడవులు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారికి, ఒకటి లేదా రెండు అదనపు ట్యాంకులను వెంట తీసుకెళ్లడం మంచిదని కంపెనీ సలహా ఇస్తుంది. దీనికి ఛార్జింగ్ చేయాల్సిన లేదా పెట్రోల్ నింపాల్సిన అవసరం ఉండదు, ఇది పూర్తి సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
కోరలియోలో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే.. ఇది మనుషులతో మాట్లాడగలదు. సవారీ చేసే వ్యక్తి చెప్పే మాటలను ఇది అర్థం చేసుకుంటుంది, తిరిగి సమాధానం ఇస్తుంది. సాధారణ సంభాషణ కూడా చేయగలదు. కంపెనీ ఇప్పటికే మాటలు చెప్పే రోబోట్‌లను తయారు చేసిన టెక్నాలజీని దీనిలో ఉపయోగించనుంది.

అంటే, ప్రయాణంలో మనిషి ఒంటరిగా ఉన్న భావన కలగకుండా ఇది తోడుగా ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే దీని ధర కోటి యెన్లు (సుమారు రూ.5కోట్లు) ఉండదని, లక్షల్లోనే ఉంటుందని ప్రాజెక్ట్ మేనేజర్ స్పష్టం చేశారు. దీంతో సామాన్య ప్రజలు కూడా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కవాసకి 2025లో ఒసాకా ఎక్స్‌పోలో కోరలియో మోడల్‌ను ప్రదర్శించినప్పుడు, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. టోక్యోలో జరిగిన ప్రపంచంలో అతిపెద్ద రోబోట్ షో iREX 2025లో కూడా ఇది స్టార్‌గా నిలిచింది. ఈ సానుకూల స్పందనతోనే కంపెనీ దీనిని మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

గత కొన్ని సంవత్సరాలుగా కొంత మందగమనం ఉన్న జపాన్ రోబోట్ పరిశ్రమ, ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంది. 2025 మూడో త్రైమాసికంలో రోబోట్ ఆర్డర్లు గత సంవత్సరం కంటే 26% పెరిగాయి. కోరలియో వంటి వినూత్న ఆలోచనలు ఈ పెరుగుతున్న వేగానికి మరింత ఊతమిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








