వెడ్డింగ్ షూట్ కోసం కారు ఇస్తే.. రూ. 12 లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది! ఎందుకో తెలుసా?
కేరళలో మోటార్ వెహికల్ యాక్ట్ ఎంత కఠినంగా అమలు చేస్తారనేది అందరికి తెలుసు. ఇటీవల మోటార్ వాహన శాఖ అధికారులు 'రోల్స్ రాయిస్'కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇంత భారీ జరిమానా ఎందుకు విధించారు? కారణం ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం కొచ్చికి చెందిన కార్ రెంటల్ కంపెనీ వివాహాది శుభకార్యాలకు 'రోల్స్ రాయిస్ ఘోస్ట్' (Rolls Royce Ghost) వంటి ఖరీదైన లగ్జరీ కారును అద్దెకు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల నవదంపతులు జంట దీన్ని ఫోటో షూట్ కోసం అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ కారు వారి దృష్టికి చేరింది.

ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ఎలాంటి పన్ను (రోడ్ టాక్స్) చెల్లించకుండానే కేరళ రోడ్ల మీద ఉపయోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలిసింది. అంతే కాకుండా కారు డాక్యుమెంట్స్ కూడా నకిలీ చిరునామాతో రిజిస్టర్ అయినట్లు నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి టాక్స్ కట్టకుండానే వారు ఉద్దేశ్య పూర్వకంగా రోడ్ల మీద తిప్పుతున్నట్లు ద్రువీకరించుకున్నారు. ఈ కారుకు రోజుకు రూ. 2 లక్షలు అద్దె వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇక్కడ కనిపించే కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 2011 మోడల్ ఘోస్ట్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కారు ఖరీదైనది అవునా? కాదా? అని కాకుండా.. నియమాలను అతిక్రమించిన కారణంగా వారికి జరిమానా విధించారు. అయితే ఆ కారును వెడ్డింగ్ షూట్ కోసం రెంటుకు తీసుకున్నట్లు తెలుసుకుని, కారుకు జరిమానా విధించి కారును విడిచి పెట్టారు.

వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తున్న కారుని సీజ్ చేస్తే.. అది రెంటుకు తీసుకున్న కొత్త జంటకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికే వారు ఫోటో షూట్ కోసం మంచిగా తయారై వచ్చారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అధికారులు కారుకు రూ. 12.04 లక్షల జరిమానా విధించి విడిచిపెట్టారు. అయితే ఈ కారు అసలు యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
పన్ను చెల్లించకపోవడం నేరం
కేరళలో పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా మంది సినీ నటులు, రాజకీయ నాయకులు పన్ను ఎగవేతకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. నిజానికి పన్ను ఎగవేతకు పాల్పడటం చట్ట రీత్యా నేరం. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే పన్ను ఎగ్గొట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
పన్ను ఎగవేతకు కారణం ఏంటంటే..
ప్రజలు పన్ను ఎగవేతకు పాల్పడటానికి ప్రధాన కారణం, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పన్ను రేటు లేదు. పాండిచ్చేరి, డామన్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోడ్ ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.ఇందులో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ నటులు, రాజకీయ నాయకులూ ఉన్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








