రూ. 45 వేలకే రోల్స్ రాయిస్ కారు.. మారుతి 800 తో మ్యాజిక్ చేసిన కుర్రాడు.!!
రోల్స్ రాయిస్ కార్లను అత్యంత ధనవంతులు మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటి ధర కోట్లలో ఉంటుంది. కేవలం మీకు ఇష్టమైన అరుదైన కలర్ కోసమే దాదాపు రూ. కోటి వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ 18 ఏళ్ల యువకుడు కేవలం రూ. 45 వేలతో రోల్స్ రాయిస్(Rolls Royce) కారును రూపొందించాడు.
జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే అందుకు తగ్గ కృషి కూడా ఉండాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అందుకు నిదర్శనం కేరళకు చెందిన ఓ కుర్రాడు. తన వద్ద ఉన్న పాత మారుతి 800 కారును లగ్జరీ రోల్స్ రాయిస్ కారుగా మార్చాడు. దీనికి లక్షల్లో ఖర్చు అయింది అనుకుంటే పొరపాటే. కేవలం రూ. 45 వేల ఖర్చుతో ఈ ఘనత సాధించాడు.

కేరళకు చెందిన యువకుడు మారుతి 800(Maruti 800) కారును లగ్జరీ రోల్స్ రాయిస్‌గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడి ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది. అంత తక్కువ ఖర్చులో లగ్జరీ కారుగా ఎలా మార్చగలిగాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.
కేరళకు చెందిన హదీఫ్(Hadeef)కు సాధారణ కార్లను విలాసవంతమైన లగ్జరీ కార్లగా మార్చడమంటే ప్యాషన్. ఆ ఆలోచనలో నుంచే తన వద్ద ఉన్న మారుతి 800 కారును రోల్స్ రాయిస్ తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కారు ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్ అమర్చాడు. ఈ కారు బ్యానెట్‌పై 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ' అని రాసి జత చేయడం ద్వారా కారు ముందు భాగానికి మంచి లుక్ వచ్చింది.
సాధారణ మారుతి 800 కారుకు పలు మార్పులు చేసి మరీ.. రోల్స్ రాయిస్ కారుగా హదీఫ్ తీర్చిదిద్దాడు. ముఖ్యంగా కారు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు చేశారు. ఇలాంటి మోడిఫికేషన్స్ కారణంగా, కారు వెలుపలి భాగం రోల్స్ రాయిస్ కారులా మారిపోయింది. అదే సమయంలో, అతను ఈ కారు లోపల BMW కార్లలో ఉండే కొన్ని లగ్జరీ ఫీచర్లను జత చేశాడు.
దీని కోసం హదీఫ్ గతంలో 800 కారులో అందించిన పలు ఇంటీరియర్ భాగాలను తొలగించాడు. వీటి స్థానంలో కారును రోల్స్ రాయిస్‌లాగా కనిపించేలా పలు భాగాలను జత చేశాడు. ఎక్స్‌టీరియర్ ప్యానెల్స్‌ను మెటల్ షీట్స్‌తో తయారు చేశారు. అంతే కాకుండా, హెడ్‌లైట్లు మరియు ఇండికేటర్లతో రోల్స్ రాయిస్ కారులా కనిపించేలా రూపొందించారు.
ఈ మోడిఫికేషన్స్ అన్నీ చేయడానికి హదీఫ్ కేవలం రూ. 45 వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో లగ్జరీ కారులా కనిపించేలా తయారుచేయడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ యువకుడు గతంలో కూడా మోటార్ సైకిల్ ఇంజిన్ ఉపయోగించి జీపును తయారు చేసినట్లు వెల్లడించాడు.
హదీఫ్ సాధారణ కారును రోల్స్ రాయిస్ కారుగా మార్చిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కేవలం 5 రోజుల్లోనే 5 లక్షల వ్యూస్‌ని సంపాదించడం విశేషం. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ప్రతిభ ఇలా వెలుగులోకి వస్తోంది. దీంతో ఔత్సాహికులు మరిన్ని ఆసక్తికరమైన ప్రయోగాలతో తమ టాలెంట్‌ను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








