'కియా ఇండియా' మనసు చాలా గొప్పది.. అందరం కచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే!
సీఎస్‌ఆర్ (Corporate Social Responsibility) కార్యక్రమం కింద శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ, కొత్తచెరువు మండలాల్లోని పలు గ్రామాలలో స్థానిక కమ్యూనిటీ లెవల్‌లో పలు సేవా కార్యక్రమాలను కియా మోటార్స్ ఇండియా (Kia Motors India) ప్రారంభించింది. గ్రామాల్లో మెరుగైన విద్య, వైద్య, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కోసం 'కేర్ ఫర్ పీపుల్' అనే థీమ్‌తో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుంది. రానున్న రోజుల్లో ఈ చిన్నపాటి సేవా కార్యక్రమాలు ఎన్నో గ్రామాల రూపు రేఖలను మార్చనున్నాయని కియా మోటార్స్ ఇండియా భావిస్తోంది. పలు CSR సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం ఐ కేర్ ఆన్ వీల్స్ (కంటి సంరక్షణ), సోలార్ స్ట్రీట్‌లైట్ ఇన్‌స్టాలేషన్, పాఠశాలల్లో సౌకర్యాల అప్‌గ్రేడేషన్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
సత్యసాయి జిల్లాలోని గుట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు సీఎస్‌ఆర్ కార్యక్రమాలకు కియా ఇండియా శ్రీకారం చుట్టింది. ఇదే గుట్టూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపట్టింది. 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త సౌకర్యం 300 మంది పాఠశాల విద్యార్థులకు సీటింగ్ సౌకర్యం కోసం రూపొందించబడింది.

కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ తో పాటు ప్రభాత్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, మంజునాథ నేత్రాలయ మరియు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (NGO) ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభాత్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీతో కలిసి "ఐ కేర్ ఆన్ వీల్స్" అనే మొబైల్ కార్యక్రమాన్ని కియా నిర్వహించనుంది.
ఇందులో భాగంగా పెనుకొండ మరియు కొత్తచెరువు మండలాల్లోని గ్రామాలలోని 3000 పైగా గ్రామీణ వాసులకు కంటి వైద్య పరీక్షలకు సంబంధించి సేవలు అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అధిక-నాణ్యత కలిగిన ఐ కేర్ సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని కియా అధికారులు పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో తిరిగే ఈ మొబైల్ యూనిట్‌లో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు మరియు సహాయకులు ఉండనున్నారు.

ఇక తన రెండో ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ గ్రామంలో స్ట్రీట్ లైట్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ NGOతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరియు స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లనున్నారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను పెనుకొండ మండలంలోని ఏడు గ్రామాల్లో (పెనుకొండ టౌన్‌తో సహా) 250 సౌరశక్తితో పనిచేసే వీధిలైట్లను ఏర్పాటు చేయనున్నారు.
సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా, చొరవ కార్బన్ ఉద్గారాలను మరియు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు కియా ప్రయత్నిస్తోంది. పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణానికి ఇది దోహద పడుతుందని కియా భావిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించింది. దీనికి ఎన్‌జీవోల పాత్ర చాలా కీలకమని కియా పేర్కొంది.

అనంతపురం మరియు శ్రీ సత్య జిల్లాలలో 'కేర్ ఫర్ పీపుల్' లో భాగంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టడంపై కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కమ్యునిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా స్థిరమైన లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిటీలలో శాశ్వతంగా సమస్యలను రూపుమార్చేందుకు అంకితభావంతో పనిచేస్తామని ఆయన చెప్పారు.
ఇటీవలె కియా ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ (APSRTD) మరియు సంభవ్ ఫౌండేషన్‌ల సహకారంతో అనంతపురం పట్టణంలోని APSRTD బస్ డిపోలో ట్రాన్స్‌ఫార్మేటివ్ హెవీ మోటర్ వెహికల్ (HMV) డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా 112 మంది పాల్గొన్నారు. అందులో 110 మంది వ్యక్తులు HMV లైసెన్స్‌లను పొందారు. అలాగే 73 మంది గ్రాడ్యుయేట్లు రవాణా లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ రంగాలలో మంచి ప్లేస్‌మంట్‌ని పొందారు.

వివిధ CSR కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ లెవల్‌లో కీలక ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పాఠశాలలను నిర్మించడం, ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్‌లతో సహా నీటి సంరక్షణ, పండ్ల చెట్ల పెంపకం ద్వారా రైతులను బలోపేతం చేయడం మరియు ప్రత్యేక ఆసుపత్రులకు సపోర్ట్ చేయడం వంటి కార్యక్రమాలపై కియా ఇండియా దృష్టి సారించింది. భవిష్యత్తులో కమ్యూనిటీలకు లాభం చేకూర్చేలా కియా ఈ కార్యక్రమాలను చేపడుతోంది.


Click it and Unblock the Notifications








