110 కి.మీ వేగంతో గేదెను ఢీకొట్టిన కియా సెల్టోస్.. నుజ్జునుజ్జయిన కారు, డ్యాష్‌క్యామ్‌లో యాక్సిడెంట్ విజువల్
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశువులు లేదా వన్యప్రాణుల కారణంగా హైవేలపై తరచూ యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ హైవేపై 110 కి.మీ వేగంతో కియా సెల్టోస్ కారు.. గేదెను ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డవడంతో వీడియో వైరల్‌గా మారింది. డ్యాష్‌క్యామ్ వీడియోను పరిశీలించినట్లయితే.. కర్ణాటకలో నాలుగు లేన్ల రహదారిపై కియా సెల్టోస్ 110 కి.మీ వేగంతో ప్రయాణిస్తుండగా.. కారు హై బీమ్ హెడ్‌లైట్లు కూడా ఆన్‌లో ఉండటాన్ని చూడవచ్చు. కొంచెం దూరం వెళ్లాక కియా సెల్టోస్ ఇతర కార్లను ఓవర్ టేక్ చేసింది.

ఇలా కొంతదూరం ముందుకు వెళ్లగానే రోడ్డుపై గేదె అడ్డంగా రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసేందుకు యత్నించారు. అయితే బ్రేక్ వేసినప్పటికీ కారుపై నియంత్రణ కోల్పోవడంతో... అతివేగంతో గేదెను ఢీకొట్టింది. కాగా ప్రమాదం జరిగిన తర్వాత కారు నుజ్జునుజ్జు కావడంతో మిగతా సమాచారమేది డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డు కాలేదు.
యాక్సిడెంట్‌కు సంబంధించి వాహన యజమాని తెలిపిన వివరాల ప్రకారం కారు అదుపు తప్పి రోడ్డుపై మూడు సార్లు బోల్తా పడినట్లు సమాచారం. యాక్సిడెంట్ తర్వాత అందుబాటులో ఉన్న కియా సెల్టోస్ కారు చిత్రాలను పరిశీలించినట్లయితే.. ప్రమాదం తాకిడికి పూర్తిగా డ్యామేజ్ అయింది.

కియా సెల్టోస్ కారు పైకప్పు, పిల్లర్ భాగం చాలా దెబ్బతింది. కాగా కారు యజమాని తన కుటుంబంతో కలిసి జాతీయ రహదారి 50 పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాదం ఎక్కడ జరిగిందనే సమాచారం అందుబాటులో లేదు. ప్రయాణించేటప్పుడు కారులో ఉన్నవారు సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంతో వారంతా క్షేమంగా ఉన్నారు.
కాగా ప్రమాదంలో గాయాలైన మూగజీవి ఎలా ఉందనే సమాచారం అందుబాటులో లేదు. అయితే కొద్ది రోజుల క్రితం కూడా మరో కియా సెల్టోస్ వాహనం ఆవును ఢీకొట్టింది. కియా సెల్టోస్ డ్రైవర్ ట్రక్కును ఓవర్‌టేక్ చేసి ముందుకు వస్తుండగా.. అకస్మాత్తుగా ఓ ఆవు డివైడర్‌పై నుంచి దూకి కారును ఢీకొట్టింది. ఈ విజువల్స్ డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.

కాగా ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో జాతీయ రహదారులపై పశువులు, వన్యప్రాణుల మరణాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నేషనల్ హైవేల పక్కన వెదురుతో కంచెలు నిర్మించాలని నిర్ణయించింది. దీని ద్వారా పశువులు రోడ్డు దాటకుండా రోడ్డుకు అవతల వైపునే ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో మూగజీవులు మరణించకుండా చూడటమే కాకుండా రోడ్డు భద్రత కూడా మెరుగవుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








