Mahindra XUV500 వాహనంలో కింగ్ కోబ్రా.. పసిగట్టిన పెంపుడు కుక్క!
పార్కింగ్ చేసిన బైక్, కార్లలో పాములు సహా ఇతర చిన్న పక్షులు కొన్నిసార్లు తలదాచుకుంటాయి. శీతాకాలం, వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. బయట చల్లని వాతావరణం కారణంగా.. వెచ్చదనం కోసం సమీపంలోని వాహనాల్లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహీంద్రా XUV500 వాహనం బానెట్‌లో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. ఈ వీడియోను కేరళకౌముది ఛానల్ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లా సూర్నాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గవి నుంచి XUV500 యాజమాని తన వాహనంలో తిరిగి వస్తున్నాడు. అయితే రోడ్డు దాటుతున్న పామును గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన XUV500 డ్రైవర్ బ్రేకులు వేసి కారును నిలిపాడు.

పెంపుడు కుక్క మొరగడంతో..: అనంతరం ప్రయాణం కొనసాగించారు. అయితే మార్గమద్యంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఓ దుకాణం వద్ద కారును నిలిపినప్పుడు అక్కడున్న ఓ కుక్క కారు వద్ద మొరగడాన్ని XUV500 యజమాని గుర్తించాడు. దీంతో నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లి తనిఖీ చేయించాడు.
అయితే కారులో పాము సహా ఇతర పక్షులు ఏవీ లేవని నిర్ధారించుకొని, అక్కడ నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ప్రాంగణంలో కారును పార్కింగ్ చేసుకున్నాడు. అయితే తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కారు వద్ద మొరగడాన్ని గుర్తించాడు. దీంతో వెంటనే పాములు పట్టే వారిని సంప్రదించాడు.

కింగ్ కోబ్రాను గుర్తించిన పెంపుడు కుక్క: స్నేక్ రెస్క్యూ టీం సభ్యుడు తొలి ప్రయత్నంలో కారు బానెట్‌లో పామును గుర్తించలేకపోయాడు. అయితే XUV500 యజమాని వద్ద ఉన్న కుక్క సాయం తీసుకున్నాడు. ఇంజిన్ కవర్ కింద విషపూరితమైన కింగ్ కోబ్రాను కుక్క కనుగొంది. దీంతో స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు వెంటనే ఇంజిన్ కవర్ తొలగించి పామును బయటకు తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కింగ్ కోబ్రా చాలా విషపూరితమైనది. ఇంజిన్ నుంచి క్యాబిన్‌లోకి ప్రవేశించినా లేదా ఇంట్లోకి ప్రవేశించినా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ కింగ్ కోబ్రాను సమీపంలోని అడవిలో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. పాములు వంటి జంతువులు చల్లని వాతావరణం కారణంగా.. శరీర ఉష్ణోగ్రతను పెంచుకొనేందుకు కారు ఇంజిన్ బే వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటాయి. ఈ ప్రాంతం వేడిగా, చీకటిగా ఉండడం కారణంగా పాములు ఇలాంటి ప్రదేశాల్లో దూరే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు అవసరం: వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువ రోజులపాటు బైక్, కార్లు, స్కూటర్లను ఒకే ప్రాంతంలో పార్కింగ్ చేయకుండా చూసుకోండి. అలా ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉండడం కారణంగా.. పాములు సహా ఇతర పక్షులు వాహనాల్లో నివాసం ఏర్పరచుకొనే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాహనాల్లోని ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అందువల్ల వాహనాల పార్కింగ్ ప్రాంతాలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువ రోజులపాటు వాహనాన్ని పార్కింగ్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. పాములు సహా ఇతర పక్షులు అవాసం ఏర్పాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇలాంటి విషపూరిత పాములు వాహనాల్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.

మీ వాహనాల్లోకి పాములు సహా ఇతర పక్షులు చొరబడినట్లు గుర్తిస్తే.. వాటికి స్వయంగా పట్టుకొనేందుకు ప్రయత్నం చేయవద్దు. అందుకు ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. వీటిని బయటకు తీసేందుకు స్నేక్ సొసైటీ సహా అటవీ శాఖ అధికారులు సహకారం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటిలో చాలా విషపూరితమైనవి ఉండవచ్చు. ఫలితంగా ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








