ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో మరో అడుగు ముందుకు వేసిన కలకత్తా పోలీసులు: 17 Tata Nexon EV ల కొనుగోలు
భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు దేశంలోని చాలా రాష్ట్రాలలోని రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కేరళ మొదలైన రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కలకత్తా పోలీసులు కూడా తమ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కలకత్తా పోలీసులు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తమ విభాగంలోకి 17 కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, వారు తమ ఫ్లీట్‌లోకి ఈ వాహనాలను చేర్చడం జరిగింది. కలకత్తా పోలీసులు ప్రస్తుతం వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

నివేదికల ప్రకారం.. కోల్‌కతా పోలీసులు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేరిన ఈ 17 నెక్సాన్ ఎలక్ట్రిక్ వహేళనతో కలిపి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 243 కి చేరింది. కోల్‌కతాలోని పోలీస్ అథ్లెటిక్ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

కలకత్తా పోలీసులు ఉపయోగించడానికి తీసుకున్న ఈ నెక్సాన్ ఈవి వాహనాల మీద మీరు రెండు నీలిరంగు గీతలు మరియు ప్రక్కన కోల్‌కతా పోలీస్ బ్యాడ్జ్‌తో ఫ్లాగ్ ఆఫ్ చేయబడ్డాయి. కావున వీటిని సులభంగా పోలీస్ వాహనాలు అని గుర్తించవచ్చు. పోలీస్ డిపార్ట్‌మెంట్ పెట్రోలింగ్ ప్రయోజనాల కోసం త్వరలో వీటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికల ప్రకారం ఇప్పుడు చాలావరకు కూడా ప్రభుత్వ శాఖలలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి. ఇందులో భాగంగానే గత ఏడాది సెప్టెంబర్‌లో కోల్‌కతా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కారణంగా ప్రభుత్వ శాఖలు ఒక్కోక్కటిగా తమ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగింహడానికి శ్రీకారం చుడుతున్నారు.

టాటా నెక్సాన్ ఈవి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు. అంతే కాకూండా ఎలక్ట్రిక్ వాహన విభగంలో అత్యధిక అమ్మకాలతో ముందుకు సాగుతున్న బ్రాండ్ కూడా. టాటా నెక్సాన్ ఈవి ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా.. అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగా ఈ SUV అమ్మకాల్లో తిరుగులేని పురోగతిని సాధిస్తోంది.

టాటా నెక్సాన్ ఈవి 30.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఒక ఛార్జ్ తో దాదాపు 312 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI చేత అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ఈ పరిధి వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ ఇటీవల తన టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ విడుదల చేసింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇది కూడా చాలా వరకు డిజైన్ మరియు ఇతర ఇంటీరియర్ ఫీచర్స్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే బ్యాటరీ మాత్రం కొంత అప్డేట్ చేయబడింది.

కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పెద్ద 40.5kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. కావున ఇది ఎక్కువ రేంజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 140 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

నెక్సాన్ ఈవి మ్యాక్స్ ఛార్జింగ్ ఆప్సన్ 3.3 kW మరియు 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులోని 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 6.5 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో ఇందులోని 50 కిలోవాట్ డిసి ఛార్జర్ సాయంతో కేవలం 56 నిముషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








