లాంబోర్గినీ అవెంటేడర్ స్పెషల్ ఎడిషన్‌ను క్రాష్ చేసిన డ్రైవర్
లాంబోర్గినీ అవెంటేడర్ వంటి సూపర్‌కార్లను టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణ ప్యాసింజర్ కార్లను నడిపినట్లుగా వీటిని హ్యాండిల్ చేస్తే చిక్కులో పడటం ఖాయం. అలాంటి ఓ సంఘటనే ఇటీవల హాంగ్‌కాంగ్‌లో చోటు చేసుకుంది.
హాంగ్‌కాంగ్‌లో ఓ టెస్ట్ డ్రైవర్ లాంబోర్గినీ అవెంటేడర్ 50వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్ కారును టెస్ట్ డ్రైవ్‌కు తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేశాడు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేయటంతో ఈ అపశృతి చోటు చేసుకుంది. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి తీవ్ర గాయాలు చోటు చేసుకోలేదు.
కానీ దురదృష్టం ఏంటంటే, కేవలం 200 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి కానున్న 'లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 యానివర్సరియో' స్పెషల్ ఎడిషన్ కార్లలో ఇదే మొట్టమొదటి ప్రమాదం కావటం. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు సంబంధించి ఏలాంటి ప్రమాదాలు నమోదు కాలేదు. మరి ఈ స్పెషల్ కారులోని ఆ స్పెషల్ ఫీచర్లేంటో ఓ లుక్కేద్దాం రండి..!

ప్రమాదానికి గురైన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 యానివర్సరియో స్పెషల్ ఎడిషన్ కారు.

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గనీ, తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.

లాంబోర్గినీ అందిస్తున్న 'అవెంటేడర్' సిరీస్‌లో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. 'లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి720-40 యానివర్సరియో' అని పిలువబడే ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ను కేవలం 200 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ వార్షికోత్సవ ఎడిషన్ సాధారణ అవెంటేడర్ కన్నా మరింత శక్తిని కలిగి ఉంటుంది. లాంబోర్గినీ అవెంటేడర్ యానివర్సరియో కారు పవర్‌ను 19 బిహెచ్‌పిలు అదనంగా (691 బిహెచ్‌పిల నుంచి 710 బిహెచ్‌పిలకు) పెంచారు.

సాధారణ అవెంటేడర్‌లో ఉపయోగించే 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను రీట్యూన్ చేసి ఈ వార్షికోత్స ఎడిషన్‌లో ఉపయోగించారు. ఇది కేవలం 2.9 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 351 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

సాధారణ లాంబోర్గినీ అవెంటేడర్‌తో పోల్చుకుంటే, దీనిని భిన్నంగా ఉంచేందుకు గాను ఈ వార్షికోత్సవ ఎడిషన్ అవెంటేడర్ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో మార్పులు చేర్పులు చేశారు. ముదురు పసుపు రంగులో (గియాల్లో మాగ్గియో లేదా యెల్లో మే కలర్) ఈ కారు ఎక్స్టీరియర్‌ను పెయింట్ చేశారు.

కంపెనీ విడుదల చేసిన వెనెవో, ఫేస్‌లిఫ్ట్ గల్లార్డో మోడళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ వార్షికోత్సవ ఎడిషన్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను డిజైన్ చేశారు. ఎక్స్టీరియర్స్‌పై 50 ఏళ్ల మార్క్‌ను గుర్తు చేస్తూ '50' బ్యాడ్జ్‌ను జోడించారు.

ఇందులో సరికొత్త నలుపు రంగు అల్లాయ్ వీల్స్ మరొక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎక్స్టీరియర్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా దీని ఇంటీరియర్లను కూడా పసుపు రంగు లెథర్‌తో తయారు చేశారు.


Click it and Unblock the Notifications








