బైక్ లేదా కారు ఆర్సీ పోయిందా? ఇంట్లో కూర్చునే ఇలా అప్లై చేయండి.. స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే
మీ బైక్ లేదా కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) పోయిందా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్సీ అనేది ఒక వాహనానికి అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ఇది మీ పేరు మీద వాహనం రిజిస్టర్ అయిందని చెప్పడానికి ఇదే మూలం. ఈ సర్టిఫికేట్‌ను రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) జారీ చేస్తుంది. ఒకవేళ మీ ఆర్సీ పోయినా లేదా దొంగిలించబడినా, మీరు సులభంగా డూప్లికేట్ ఆర్సీ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ తిరగాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాసులు ఇంట్లో కూర్చునే డూప్లికేట్ ఆర్సీ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డూప్లికేట్ ఆర్సీ కోసం మీరు రెండు పద్ధతుల్లో అప్లై చేసుకోవచ్చు. అవి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. అయితే ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కాబట్టి, ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ చాలా సులభం, వేగవంతమైనది. మీ సమయం, డబ్బు ఆదా అవుతాయి.

డూప్లికేట్ ఆర్సీ కోసం అప్లై చేసే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇవి ప్రతి వాహనదారుడికి తప్పనిసరి.
FIR కాపీ: ఆర్సీ పోయినట్లు లేదా దొంగిలించబడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒరిజినల్ రిపోర్ట్ కాపీ. ఇది అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్‌ఐఆర్ నెంబర్‌ను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.
ఫారం 26: డూప్లికేట్ ఆర్సీ కోసం అప్లై చేసే దరఖాస్తు ఫారం. దీన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాహన బీమా సర్టిఫికేట్: మీ వాహనం ప్రస్తుత ఇన్సురెన్స్ డాక్యుమెంట్. ఇది తప్పకుండా చెల్లుబాటులో ఉండాలి.
పీయూసీ (PUC) సర్టిఫికేట్: మీ వాహనం పొల్యూషన్ అండర్ కంట్రోల్‌లో ఉందని తెలిపే సర్టిఫికేట్.

చిరునామా రుజువు: ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, విద్యుత్ బిల్లు వంటివి. మీ ప్రస్తుత చిరునామాకు సంబంధించిన రుజువు అవసరం.
పన్ను చెల్లింపు రుజువు: మీ వాహనం పన్నులు చెల్లించిందని చూపించే రసీదు.
ఈ పత్రాలన్నీ సిద్ధంగా ఉంచుకుంటే ఆన్‌లైన్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్
వెబ్‌సైట్‌కి వెళ్లండి: ముందుగా, భారత ప్రభుత్వ పౌరసేవల వెబ్‌సైట్ అయిన పరివహన్ సేవా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
సర్వీసు సెలక్ట్ చేసుకోవాలి : హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌ను క్లిక్ చేసి, ఆ తర్వాత వెహికల్-రిలేటెడ్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకోవాలి.
స్టేట్ సెలక్ట్ చేసుకోవాలి : ఆ తర్వాత డ్రాప్-డౌన్ లిస్ట్‌లో మీ రాష్ట్రాన్ని (తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్) ఎంచుకోండి.
డూప్లికేట్ ఆర్సీ కోసం క్లిక్ చేయండి: ఇప్పుడు, ఇచ్చిన ఆప్షన్లలో డూప్లికేట్ ఆర్సీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ చేయండి: మీరు ఇంతకు ముందు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోకపోతే, ముందుగా రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి, మీ వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ యూజర్ ఐడీ,పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
వివరాలను నమోదు చేయండి: మీ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఛాసిస్ నంబర్ చివరి 5 అంకెలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఈ-కేవైసీ పూర్తి చేయండి: ఆ తర్వాత ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని జనరేట్ చేయండి. ఓటీపీని నమోదు చేసిన తర్వాత, దరఖాస్తు ఫారంలో అడిగిన అన్ని వివరాలను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
ఫీజు చెల్లించండి: దరఖాస్తు ఫారం పూర్తిగా నింపిన తర్వాత, నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు రసీదును ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత, మీరు మీ దగ్గరి ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వాహనాన్ని ఫిజికల్‌గా వెరిఫై చేయించడం కోసం ముందే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. మీరు అపాయింట్‌మెంట్ తీసుకున్న రోజున, అన్ని ఒరిజినల్ పత్రాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటవుట్‌తో ఆర్టీఓకు వెళ్లాలి.
అక్కడ డాక్యుమెంట్ల తనిఖీ, వాహనం పరిశీలన పూర్తయిన తర్వాత, కొన్ని రోజుల్లో మీ డూప్లికేట్ ఆర్సీ జారీ చేయబడుతుంది. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఎలాంటి ఏజెంట్ల సహాయం లేకుండా, ఇంట్లో కూర్చొని సులభంగా డూప్లికేట్ ఆర్సీని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








