ఆ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే పేదలకు రూ. 40,000 ఆర్థిక సాయం..
2070 నాటికి దేశంలో సున్నా కర్బన ఉద్గారాల దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలను FAME-2 సబ్సిడీ ద్వారా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles)పై రాయితీని అందిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కార్మికులకు రూ.40,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తాజాగా ప్రకటించారు. గ్వాలియర్ విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం ఈవెంట్‌లో ఆయన ఈ గుడ్‌న్యూస్ అందించారు. తద్వారా మధ్యప్రదేశ్‌లో ఈవీలకు ఆదరణ పెరుగుతుందని మోహన్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు(Subsidy On EV's) ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కార్మికులకు భారీ రాయితీని ప్రకటించడంతో ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది నిజంగా అభినందనీయం. దీని వల్ల పేదలు అతి తక్కువ(Discount On EV's In Madhya Pradesh) ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీలపై మొగ్గు చూపుతారు. తద్వారా కర్బన ఉద్గారాలను నియంత్రించవచ్చు. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం FAME అనే సబ్సిడీని అందిస్తోంది. మొదటి దశలో, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు FAME సబ్సిడీ నేరుగా అందించింది. ఆ తర్వాత FAME 2 అనే గ్రాంట్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని నేరుగా వాహన తయారీదారులకు అందించడంతో వాహన ధరలు తగ్గుతున్నాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు ఎలక్ట్రిక్ కార్లతో సహా ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అన్ని వాహనాలకు FAME సబ్సిడీ అందుబాటులో ఉంది. ఇందుకోసం మార్చి 31, 2024 గడువు ఉంది. ఏప్రిల్ 1 తర్వాత ఈ సబ్సిడీ ఆగిపోనుంది. ఈ కారణంగా ఏప్రిల్ 1 నుంచి ఈవీల ధరలు పెరుగుతుండగా.. మూడో దశలో ఫేమ్ 3 సబ్సిడీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఈ క్రమంలో ఫేమ్ 2 సబ్సిడీని జులై 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వీటిపై రాయితీలు జూలై 31 వరకు వర్తించనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,500 కోట్లు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మధ్యంతర కాలానికి నాలుగు నెలలకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది.
FAME 2 గ్రాంట్ కింద డిసెంబర్ 21, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.5,422 కోట్లు ఖర్చు చేసింది. దీని ద్వారా 12,16,350 వాహనాలకు రాయితీలు ఇచ్చింది. ప్రస్తుతం FAME 3 సబ్సిడీ ప్రకారం, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు మరియు 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 55,000 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు మరియు 7000 ఎలక్ట్రిక్ బస్సులకు రాయితీలు అందించాలని యోచిస్తోంది.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. గత ఫిబ్రవరిలోనే 81,963 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోగా.. గత 11 నెలల్లో 8 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు జరిగాయి. భవిష్యత్తులో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగనుంది.


Click it and Unblock the Notifications








