ఎక్స్‌ప్రెస్‌వేపై థార్ డ్రైవర్ చర్యలు.. ఇలా చేయడం కరెక్టేనా? మీరే చెప్పండి
ఒక ఎక్స్‌ప్రెస్‌వేపై 'మహీంద్రా థార్' (Mahindra Thar) యూ టర్న్ తీసుకుని.. ఇతర ప్రయాణికులకు ఆటంకం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పెడచెవిన పెట్టడమే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో మహీంద్రా థార్ ఎక్స్‌ప్రెస్‌వే మీద యూ-టర్న్ తీసుకుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందని ఖచ్చితంగా తెలియలేదు, కానీ ఇది ఉత్తర భారతదేశంలో జరిగినట్లు అవగతం అవుతోంది.

వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే మీద మహీంద్రా థార్ SUV రాంగ్ సైడ్ వెళ్లడమే కాకుండా.. ఇష్టానుసారంగా యూ టర్న్ తీసుకుంది. ఆ సమయంలో వాహనాలు వేగంగా వస్తున్నాయి. థార్ యూ టర్న్ తీసుకోవడం గమనించిన ఇతర వాహనాలు వేగాన్ని తగ్గించాయి. అంతే కాకుండా ఈ వీడియోలో చూసినట్లైతే సమీపంలోనే ఓ టోల్ గేట్ ఉండటం కూడా గమనించవచ్చు.
రాంగ్ సైడ్ వెళ్తున్న సమయంలో ఎదురుగా టోల్ గేట్ ఉండటంతో థార్ డ్రైవర్ మళ్ళీ వెనక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఉన్నది ఎక్స్‌ప్రెస్‌వే మీద అని కనీస జ్ఞానం కూడా లేకుండా ఆ థార్ డ్రైవర్ ఆలా ప్రవర్తించడం ఇతర వాహన వినియోగదారులకు చాలా ఇబ్బంది కలిగించింది. బైకర్లు కూడా థార్ SUVని గమనించి చిన్న గ్యాప్ తీసుకుని వెళ్తున్నారు.

అది ఎక్స్‌ప్రెస్ కాబట్టి వాహనాలు వేగంగా వచ్చిన మహీంద్రా థార్ SUVని ఢీ కొట్టే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇతర వాహనదారులు కూడా యూ టర్న్ తీసుకుంటున్న కారును గమనించి వారి వేగాన్ని తగ్గించారు. కానీ అక్కడ కొన్ని వాహనాలు కొంత సమయం నిలిచేలా చేసాడు. ఇది వారి ప్రయాణానికి కొంత ఇబ్బంది గలిగించింది.
ఈ సంఘటన మొత్తం ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీద పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో థార్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కనిపించలేదు. అయినప్పటికీ పోలీసులు ఈ సంఘటన గురించి ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాము.

ప్రస్తుతం దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైవేల మీద కెమెరాలను అమర్చి తప్పు చేసిన వాహనదారులు ఎంతవారైనా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను అమర్చి ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇవన్నీ రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలే.
వాహన వినియోగదారులు కూడా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తన వల్ల ఇతర వాహనదారులలు ఇబ్బందులు కలగకుండా నడుచుకోవాలి. హైవేల మీద మితిమీరిన వేగం, యూ టర్న్ వంటివి తీసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తే. ఈ ప్రమాదం ప్రాణాలనే హరించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నియమాలను పాటిస్తూ ప్రజా రహదారులపై ప్రయాణించాలి, అప్పుడే దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








