ఒక్క ఛార్జింగ్ స్టేషన్ లేదు.. ఏం చేయాలో తెలియక కర్ణాటక నుంచి గోవాకు స్కూటర్ తోసుకెళ్లిన యువకుడు
కొన్నేళ్ల కిందట మన దేశంలో పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ఉన్నన్ని లేవు. దీంతో పెట్రోల్ అయిపోతే బైకులు, స్కూటర్లను తోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లే వాళ్లను చిన్నప్పుడు చాలా మందినే చూసే ఉన్నాం. అప్పట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంతలా డెవలప్ కాలేదు. ఇన్ని వాహనాలు అప్పట్లో లేవు. దీంతో కొన్నాళ్ల కిందట దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే పెట్రోల్ బంకులు ఉండేవి. గ్రామాల్లో ఉండేవారు పట్టణానికి వెళ్లినప్పుడు కావాల్సిన పెట్రోల్ అదనంగా తెచ్చుకునే వారు.
ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. అడుగడుగునా పెట్రోల్ బంక్స్ ఉంటున్నాయి. దీంతో దాదాపు బైక్ లను తోసుకెళ్లే దృశ్యాలు కనిపించడం చాలా అరుదు. మారుమూల గ్రామాల్లో కూడా పెట్రోల్ బంక్స్ ఉంటున్నాయి. ఇలాంటి రోజుల్లో ఓ వ్యక్తి కర్ణాటక నుండి గోవాకు స్కూటర్‌ను తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి అంత దూరం ఆ వ్యక్తి స్కూటర్‌ను ఎందుకు తోసుకెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తోస్తున్నది ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రస్తుతం ఈవీ బైకుల యుగం నడుస్తోంది. ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. దీంతో చాలా మంది ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈవీ వాహనాలు పర్యవరణాన్ని కాలుష్యం బారిన పడకుండా చేయడంతో పాటు.. పెట్రోల్, డీజిల్‌లతో పోల్చుకుంటే తక్కువ ఇంధన ఖర్చును కలిగి ఉండి డబ్బును ఆదా చేస్తాయి.
వాస్తవానికి కర్ణాటక, గోవా సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు. బహుశా సరిహద్దు వెంబడి ఎక్కడో ఆ వ్యక్తి నడుపుతున్న స్కూటర్ ఛార్జింగ్ అయిపోయి ఉండవచ్చు. దీంతో ఈ వ్యక్తి తన వాహనాన్ని రీఛార్జ్ చేసుకునేందుకు అనేక కిలోమీటర్లు నెట్టవలసి వచ్చింది. భారత దేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి కానీ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల మీద మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విషయం ఈ సంఘటన గుర్తు చేస్తుంది.

ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారికి సబ్సిడీలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు చౌకగా లభిస్తున్నప్పటికీ ప్రజలు ఛార్జింగ్ సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ఛార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతుంది. ఈ నమ్మకంతోనే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి కర్ణాటకలోని కార్వార్ నుంచి గోవాకు సుమారు 20కిలోమీటర్ల వరకు స్కూటర్ ను తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. తను మాట్లాడుతూ.. ''ఇంత దూరం నడిచినా నాకు ఒక్క ఛార్జింగ్ స్టేషన్ కూడా కనిపించలేదు. ఈ మధ్యలో నేను మూడు పెట్రోల్ బంక్స్ చూశాను. కానీ ఏ పెట్రోల్ బంక్ లో కూడా ఛార్జర్ లేకపోవడంతో ఇబ్బంది అయింది.''

ఇలాంటి ఇబ్బందులే కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారి మనసు మార్చుకునేలా చేస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ తగినంత ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో లేవన్నది మాత్రం అక్షర సత్యం. దీన్ని ధృవీకరిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యక్తి కాస్త ముందే ప్లాన్ చేసుకుని ఉంటే తను 20కిలో మీటర్ల మేర ఇలా స్కూటర్ తోసుకెళ్లాల్సిన అవసరం రాకపోయి ఉండేదనేది వాస్తవం.
ఈ వీడియో చూసిన తర్వాత కొందరు..''ఈవీని కొనుగోలు చేసిన వాళ్లు.. కొన్ని రోజులు నడిపితే తర్వాత దాని రేంజ్ అర్థం అవుతుంది. ఎంత ఛార్జింగ్ ఉంటే ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్లుతుంది అనేది అంచనా వేయగలుగుతారు. దీంతో ప్రయాణానికి ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే వెళ్లే మార్గంలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందో చెక్ చేసుకోవచ్చు. దీనిని స్కూటర్ తయారీ కంపెనీ తన యాప్‌లో లేదా ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications