ఇది మన పాపులర్ మారుతి ఆల్టో 800 కారు అంటే ఎవరైనా నమ్ముతారా? అయితే, చూడండి..!
సిజర్ డోర్లు, క్రాసోవర్ టైప్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇవన్నీ చూస్తుంటే, ఇదేదో ఫారిన్ కారులా ఉంది కదూ..! కానీ అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు. ఇది మనం నిత్యం రోడ్లపై చూసే మారుతి ఆల్టో 800 కారు. భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే నెంబర్ వన్ కారు ఆల్టోని, ఓ ఔత్సాహికుడు ఇలా కస్టమైజ్ చేయించుకున్నాడు. క్రాసోవర్ లా మార్చబడిన మారుతి ఆల్టో 800 హ్యాచ్‌బ్యాక్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో అగ్రస్థానంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. దాదాపు 20 ఏళ్లకు పైగా ఈ కారు మార్కెట్లో ఉండటం, మారుతి సుజుకి బ్రాండ్ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసం, సరసమైన ధరలు, తక్కువ మెయింటినెన్స్ మరియు విరివిగా ఎక్కడైనా లభించే విడిభాగాలు ఇలాంటి అనేక అంశాలు మారుతి ఆల్టో కారు విజయానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ కారుకి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా అంత గిరాకీ ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇలాంటి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు తమ ఆల్టో కారును తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకుంటుంటారు. అయితే, ఈ కస్టమైజేషన్ లో చిన్నపాటి అప్‌గ్రేడ్స్ మినహా దాని డిజైన్ మొత్తం మారిపోయేలా ఎవరూ కస్టమైజ్ చేసుకోరు. కానీ, ఓ కార్ మోడిఫైయర్ మాత్రం, ఏకంగా ఇది అసలు ఆల్టో కారేనా అనే సందేహం వచ్చేలా చాలా మోడ్రన్ గా మార్చేశాడు. లాంబోర్ఘిని వంటి కార్లలో కనిపించే సిజర్ డోర్లు, 2 డోర్లు మరియు వెనుక వైపు వాలుగా ఉండే కూప్ స్టైల్ బాడీ డిజైన్ మరియు పెద్ద బంపర్లతో స్టాండర్డ్ ఆల్టో 800 కారు రూపురేఖల్నే మార్చేశాడు.

విహాస్ చౌదరి అనే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ మోడిఫైడ్ మారుతి సుజుకి ఆల్టో 800 కారు ముందు భాగంలో గుండ్రటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద బంపర్, స్ప్లిట్ బానెట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, సైడ్స్‌లో పెద్ద వీల్ ఆర్చ్ లు మరియు దానికి తగినట్లుగా అమర్చిన పెద్ద ఆఫ్-రోడ్ టైర్లు, పైకి తెరచుకునే సిజర్ డోర్లు, వాలుగా ఉండే రియర్ రూఫ్ లైన్, వెనుక వైపు పెద్ద రూఫ్ స్పాయిలర్ మరియు సన్నటి బంపర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఈ మోడిఫైడ్ ఆల్టో కారులో చూడొచ్చు.
ఈ కారులో అమర్చిన పెద్ద ఆఫ్-రోడ్ టైర్ల కారణంగా ఇది ఓ మంచి ఎస్‌యూవీ టైప్ లుక్‌ని కలిగి ఉంటుంది. మోడిఫైడ్ ఆల్టో కారులో అందరి దృష్టిని ముందుగా ఆకట్టుకునేది దాని డోర్లు. హైడ్రాలిక్ సాయంతో పైకి ఎత్తబడే ఈ డోర్లు కోట్ల రూపాయలు ఖరీదు చేసే లగ్జరీ కార్లను తలపిస్తాయి. కారు ఎక్స్టీరియర్ మొత్తాన్ని బ్లాక్ అండ్ బ్లూ కలర్ థీమ్ తో పెయింట్ చేశారు. అలాగే, ఇంటీరియర్ లో క్యాబిన్ లేఅవుట్ ని మరియు సీట్లను బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్ తో డిజైన్ చేశారు.

బయటి వైరు కారు చుట్టూ అక్కడక్కడా క్రోమ్ ఫినిషింగ్స్ కనిపిస్తాయి, ఇది మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. దీనిని కూప్ డిజైన్ లా తయారు చేసినందు వలన సైడ్ లో ఉండే ఇంధనం నింపే ప్రాంతాన్ని కారు వెనుక బంపర్‌కు మార్చడం జరిగింది. క్యాబిన్ లోపలికి వస్తే, స్పోర్టీ స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్ చుట్టూ రెడ్ యాక్సెంట్స్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని పైన ఏసి కంట్రోల్స్, రెడ్ కలర్ లో ఉండే గ్లౌవ్ బాక్స్, రేసింగ్ కార్లను తలపించే రూఫ్ డిజైన్, సీట్లు మరియు ఫ్లోర్ మ్యాట్స్ ఇందులో కనిపిస్తాయి.

ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ మినహా, కారు ఇంజన్ లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. ఈ బుజ్జి కారు అదే బుజ్జి 800 సిసి ఇంజన్ ను కలిగి ఉంటుంది. మారుతి ఆల్టో 800 కారులో 0.8 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి శక్తిని మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి ఉంటుంది. పెరిగిన వీల్స్ మరియు టైర్ల కారణంగా చాస్సిస్ లో ఏవైనా మార్పులు చేశారా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.

ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఆల్టో 800 విషయానికి వస్తే, దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.3.25 లక్షల నుండి రూ.4.95 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ శాంత్రో, డాట్సన్ రెడీ-గో, రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి చిన్న కార్లకు పోటీగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








