ఆకాశం నుంచి కనిపించిన అద్భుతం.. మీ కళ్లు సైతం నమ్మలేని దృశ్యం.. ఇది ఒక కార్ల సముద్రం!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు వినగానే, ప్రజలలో విశ్వాసం, అందుబాటు ధర, పనితీరు గుర్తుకు వస్తాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం సరసమైన ధరలో నాణ్యమైన కార్లను అందించడం ఈ కంపెనీ ప్రధాన బలం. ప్రతి సంవత్సరం లక్షలాది వాహనాలను తయారు చేసే సామర్థ్యం కలిగిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక ప్లాంట్లు ఉన్నాయి. అందులో గుజరాత్ రాష్ట్రంలోని హన్సల్‌పూర్ ప్లాంట్ ప్రత్యేక ప్రాధాన్యం వహిస్తుంది. సంవత్సరానికి 7,50,000 కంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన తయారీ యూనిట్‌గా ఇది ప్రసిద్ధి చెందింది.
ఆధునిక సాంకేతికతతో, అధునాతన మౌలిక వసతులతో నడుస్తున్న ఈ ప్లాంట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విపరీతమైన సంఖ్యలో కార్లు రవాణా అవుతున్నాయి. ఇటీవల ఈ ప్లాంట్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఇ-విటారా (e-Vitara) పేరుతో మార్కెట్‌లోకి ప్రారంభించింది. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

ఆగస్టు 26న జరిగిన ఈ ప్రారంభోత్సవానికి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరై,ఈ ఎలక్ట్రిక్ SUVకు జెండా ఊపారు. దేశంలో తయారైన తొలి ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందిన ఇ-విటారా, గ్రీన్ ఎనర్జీ వాహనాల వైపు భారతదేశం వేస్తున్న దశాబ్దపు అతిపెద్ద అడుగుగా భావించబడుతోంది. ఈ ఘట్టం అనంతరం విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆకాశం నుంచి తీసిన ఈ వీడియోలో హన్సల్‌పూర్ ప్లాంట్‌లోని విస్తారమైన స్టాక్ యార్డ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆకాశం నుంచి తీసిన ఈ దృశ్యాలు చూస్తే, ఎక్కడికక్కడ మెరుస్తూ నిలిచిన వేల కొత్త కార్లు చిన్న చిన్న పెట్టెల్లా కనిపిస్తాయి. చూడగానే ఆకట్టుకునేలా వరుసలుగా అమర్చబడి ఉన్న ఆ కార్ల ర్యాలీలు చూసిన వారిలో ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
పై వీడియోను ANI నుంచి తీసుకున్నాం. భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా పోటీ పడగలిగే స్థాయిలో వాహనాలను తయారు చేసే శక్తి మన దేశానికి ఉందని ఈ దృశ్యాలు గట్టిగా చెబుతున్నాయి. హన్సల్‌పూర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కార్లు కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కావు. దేశంలోని ప్రతి మూలకు సరఫరా అవుతున్న ఈ వాహనాలు, యూరప్, ఆసియా, ఆఫ్రికా వంటి పలు దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.
ఇది భారత ఆటోమొబైల్ పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో పొందుతున్న గుర్తింపుకు నిదర్శనం. మారుతి సుజుకి, ఇ-విటార'తో దేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల యుగంలోకి తీసుకెళ్తూ, ప్రపంచానికి మన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది. భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తోంది.
సుజుకి హన్సల్‌పూర్ ప్లాంట్ నుంచి ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం, రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి పునాది వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఒక కారు ప్రారంభం కాదు, భారత తయారీ శక్తికి ప్రతీక అని ఆటోమొబైల్ నిపుణులు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications








