కదులుతున్న ఓమ్ని వ్యాన్‌లో చెలరేగిన మంటలు.. తప్పించుకున్న డ్రైవర్, తృటిలో మరో కారుకు తప్పిన పెను ప్రమాదం
నడిరోడ్డుపై కదులుతున్న మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆ కారులో డ్రైవర్ లేకపోయినా.. మంటలు చెలరేగుతున్న కారు అలాగే కొద్ది దూరం దూసుకుపోయింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తిరువనంతపురంలో ఇటీవల రోడ్డుపై కదులుతున్న మారుతీ సుజుకీ ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలను స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. కాగా మారుతి సుజుకి ఓమ్ని కారు రోడ్డుపైకి వచ్చాక కాసేపటికి అందులో మంటలు చెలరేగడాన్ని గ్రహించిన డ్రైవర్ వెంటనే.. అందులో నుంచి తప్పించుకున్నాడు.

అయితే మంటలు చెలరేగాక.. డ్రైవర్‌కు కారును ఆపే పరిస్థితి లేకపోవడంతో వెంటనే అందులో నుంచి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. దీంతో సెల్ఫ్ డ్రైవింగ్‌లోనే ఉన్న ఓమ్ని కారు అలాగే మంటల్లో కాలిపోతూ వెళ్తుండటంతో డ్రైవర్ దానిని ఆపలేకపోయారు. కారు మంటల్లో కాలిపోతూనే రోడ్డుపై కదులుతూ ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. మంగళవారం(నవంబర్ 21) న ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు అలాగే కాలిపోతూ వెళ్తూ చాలా దూరం వెళ్లి ఆగిపోయింది. కొద్దిలో ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టబోతుండగా ఆ కారు డ్రైవర్ దానిని తప్పించాడు. గమనించిన కొందరు స్థానికులు.. మంటల్లో కదులుతున్న కారును ముందుకు పోనివ్వకుండా ఆపేందుకు ముందు టైర్ల వద్ద భారీ రాయిని ఉంచారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా కారులో మంటలు ఎలా చెలరేగాయనే దానికి సంబంధించి కారణం ఇంకా తెలియరాలేదు. స్థానికులు, డ్రైవర్ అందించిన సమాచారం ప్రకారం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటల్లో కాలిపోయి వాహనం పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కారులో అగ్నిప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 1984 లో మొదటిసారిగా ఓమ్ని వ్యాన్‌ను ప్రారంభించింది. అప్పట్లో ఈ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లలో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా వ్యక్తిగత అవసరాలు, వాణిజ్యపరంగానూ మంచి ఉనికిని సంపాదించుకుంది.

అప్పట్లో ఎక్కువగా సినిమాల్లో మారుతి సుజుకి ఓమ్ని(Maruti Suzuki Omni) కారు కిడ్నాపర్స్ కారుగా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ఎక్కువగా మీరు ఈ కార్లను చూడవచ్చు. కాగా మారుతి సుజుకి ఓమ్ని 1998లో దాని మొదటి ఫేస్‌లిఫ్ట్‌తో పరిచయం అయింది.
సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు భారత మార్కెట్లో నిలిచిన ఓమ్ని కారును మారుతి సుజుకి.. 2019 లో దాని ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ శాశ్వత వర్క్ హార్స్‌ను మారుతి వీడ్కోలు పలికింది. ఏదేమైనా ఒకప్పటి సినిమాల్లో ఈ కారును తరచూ కిడ్నాప్ సీన్ల కోసం వాడేవారంటే అతిశయోక్తి కాదు. కాగా కేరళలో అగ్ని ప్రమాదానికి గురైన ఓమ్ని కారు ఏ మోడల్ అనేది తెలియరాలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








