ఏం ఐడియా గురూ.. మారుతి ఓమ్నిని ఓడగా మార్చిన యువకుడు..
కారును ఓడగా మార్చడం మీరెప్పుడైనా చూశారా.. సాధారణంగా సినిమాల్లో, ఆఫ్ రోడింగ్‌లోనూ తక్కువ లోతు ఉన్న నీటి ప్రవాహంలో కార్లను నడపడం చూసి ఉంటాం. కానీ కారును ఓడలా మార్చి సునాయాసంగా పడవ మాదిరిగా నడపడం చూసి ఉండరు. ఇక్కడ ఓ యువకుడు మారుతి ఓమ్నితో ఈ మ్యాజిక్‌ను చేశాడు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఒకప్పుడు భారత మార్కెట్లో మారుతి సుజుకి అందించిన ప్రముఖ కార్ మోడళ్లలో ఓమ్ని ఒకటి. ఈ కారు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా.. ఇప్పటికీ భారతీయ రోడ్లపై తిరగడాన్ని చూస్తున్నాం. ఈ ఓమ్ని వ్యాన్‌ను ఎక్కువగా.. స్కూల్ బస్‌గా, అంబులెన్స్‌గా, గూడ్స్ వాహనంగా పలు రకాలుగా వినియోగించేవారు. అంతే కాకుండా.. సినిమాల్లోనూ ఎక్కువగా ఈ కారును ఉపయోగించేవారు.

కాగా ఇటీవల ఓ యువకుడు అలాంటి మారుతి ఓమ్ని వాహనాన్ని నీటిపై తేలుతూ, రోడ్డుపై పరుగులు తీయగలిగే వాహనంగా మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కేరళలోని ఎర్నాకులం జిల్లా పెరుంబవూరుకు చెందిన జైన్ రాజ్.. ఈ మారుతి ఓమ్నిని ఓడ కమ్ కారుగా మార్చారు.
జైన్ రాజ్.. సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి పాత ఓమ్నీని కొనుగోలు చేసి ఓడగా రూపాంతరం చెందించారు. ఇందుకోసం ఓమ్నీలో పలు మార్పులు చేశారు. ప్రధానంగా దీనిని జీపులా మార్చారు. ముందుగా పైకప్పును పూర్తిగా తొలగించిన తరువాత, అతను వెనుక సీట్లను కూడా తొలగించారు. అంతేకాకుండా ముందు భాగంలోని సీట్లను తీసివేశారు.

ఆ సీట్లకు బదులు ఇళ్లలో వాడే ప్లాస్టిక్ సీట్లను ముందు భాగంలో అమర్చారు. దీని ద్వారా.. ఆరుగురు లేదా ఏడుగురు ప్రయాణించాల్సిన ఓమ్నిలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే జైన్ రాజ్.. ఈ సీట్లను ఎందుకు తొలగించాడని మీకు సందేహం రావచ్చు. అనవసరమైన బరువును తగ్గించడానికి ఈ సీట్లను తొలగించాడు.
ఇందుకు కారణం మారుతి సుజుకి ఓమ్నీలో ఒక్కో సీటు దాదాపు 13 కిలోల బరువు ఉంటుంది. కానీ ప్లాస్టిక్ సీటు బరువు కేవలం 3 కిలోల కంటే తక్కువగానే ఉంటుంది. దీంతో పాటు జైన్ రాజ్ ఇంకా పలు మార్పులు కూడా చేశారు. వాహనం అడుగు భాగాన్ని వాటర్ టైట్‌గా తీర్చిదిద్దారు. నీటి గుండా వెళుతున్నప్పుడు వాహనం నీటిలోకి ప్రవేశించకుండా ఇలా చేశారు.

జైన్ రాజ్ మెటల్ షీట్లను ఉపయోగించి కారు అడుగు భాగాన్ని పూర్తిగా మూసివేసారు. దీని ద్వారా, కారు దిగువ భాగం తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ఓమ్ని నీటిపై ప్రయాణించడం కోసం సాధారణ కార్లలో ఉపయోగించే ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది వాటర్ ప్రూఫింగ్ ద్వారా రక్షించబడుతుంది. అంతేకాకుండా ఇంజిన్‌ను నియంత్రించడానికి జిప్సీ యొక్క గేర్‌బాక్స్‌ని ఉపయోగించారు.
అయితే ఓమ్మి కారుకు టైర్లు బయట ఉండటంతో అతను వేగ పరిమితి సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య లేకపోతే పడవలాగా సునాయాసంగా ముందుకు వెళుతుందని జైన్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటానని జైన్ రాజ్ వీడియోలో వెల్లడించారు. అయితే ఈ వాహనం నీటిలో ప్రయాణించేందుకు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు ట్రాక్టర్లలో ఉపయోగించే టైర్లను జైన్ ఉపయోగిస్తున్నారు.

మారుతి ఓమ్నిని ఓడలా మార్చేందుకు అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు జైన్ రాజ్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా ఇంజన్‌ను సరైన చోట అమర్చుకునే విషయంలో రకరకాల సమస్యలు ఎదురైనట్లు చెప్పారు. ఎందుకంటే తేలియాడే వాహనాలకు బరువు చాలా ముఖ్యం. ఒకే చోట కేంద్రీకరించినట్లయితే వాహనం నీటిలో తేలకుండా మునిగిపోయే అవకాశం ఉంది.
వాహనం యొక్క వైబ్రేషన్ల కారణంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు జైన్ రాజ్ పేర్కొన్నారు. ఇలాంటి అనేక అడ్డంకుల తర్వాత, నీటిపై తేలియాడే మరియు రోడ్డుపై నడిచే ఓమ్నిని సిద్ధం చేసినట్లు వివరించారు. జైన్ రాజ్ ఇలాంటి కార్లను మోడిఫై చేయడమే కాకుండా చిన్న కార్లను తయారు చేయడంలో కూడా సమర్థుడిగా పేరుపొందారు.


Click it and Unblock the Notifications








