క్యారవాన్‌గా మారుతి సుజుకి స్విఫ్ట్.. స్టార్ హోటల్ తరహా ఇంటీరియర్ ఫీచర్లు.!!
భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్ మోడళ్లలో మారుతీ సుజుకి స్విఫ్ట్(Maruti Suzuki Swift) ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్ మోడళ్లలో స్విఫ్ట్ ముందుంటుంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో స్విఫ్ట్‌ను ఓ జంట వసతి సౌకర్యాలతో కూడిన క్యారవాన్‌గా మార్చిన వీడియో వైరల్ అవుతోంది.
క్యారవాన్(Caravan) అంటే ఎవరికైనా గుర్తొచ్చేది లగ్జరీ సౌకర్యాలు, ఇంట్లో ఉన్న అనుభూతి, సినీ సెలబ్రిటీలు, ధనవంతులు, ప్రముఖులు. సినిమా షూటింగులు, రాజకీయ ప్రచారాల్లో ఎక్కువగా ఇవి దర్శనమిస్తుంటాయి. అయితే ఇవి కొంచెం పెద్దదిగా ఉంటూ, బయటి నుంచి బస్సులా కనిపిస్తాయి. కానీ కారును క్యారవాన్‌లా మార్చడం ఎక్కడైనా చూశారా..

ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఫ్యామిలీ.. 2020 మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఉపయోగిస్తారు. వారు తరచుగా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తుంటారట. అయితే అలా వెళ్లిన ప్రతిసారి.. వారు వసతి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారని ఆ ఫ్యామిలీ వెల్లడించారు. దీంతో ప్రయాణాలు చేసిన ప్రతిసారీ ఖర్చులు ఎక్కువ కావడంతో.. ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు.
ఇందుకోసం ఆ ఫ్యామిలీ ఓ మంచి(Swift Converted Into Caravan) ప్లాన్ వేసింది. తమ టూర్‌లో ఎదురయ్యే వసతి ఖర్చులు తగ్గించుకోవడానికి తమ కారును క్యాంపర్ వ్యాన్‌గా మార్చాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం, వారు తమ మారుతి సుజుకి స్విఫ్ట్ కారును వసతితో కూడిన మొబైల్ హోమ్‌గా అధునాతనంగా తీర్చిదిద్దారు.

ఇలా తమ స్విఫ్ట్ కారును క్యారవాన్‌గా మార్చడంతో ఇంటీరియర్ స్టార్ హోటల్ తరహాలో అధునాతనంగా మారింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్విఫ్ట్ కారులో అత్యాధునిక సదుపాయాలతో పాటు వసతి సౌకర్యాలు, భోజనానికి సరిపడా సరుకులను కల్పించడంతో స్టార్ హోటళ్లకు సైతం టఫ్ ఇచ్చే హోటల్‌గా మార్చారు.
ఈ మారుతి స్విఫ్ట్ క్యారవాన్‌లో బాత్‌రూమ్, టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వారు సుదూర ప్రయాణాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. అదే సమయంలో హాయిగా నిద్రపోయే సదుపాయం ఉండేలా బెడ్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం, ఈ కారులో ఫోల్డింగ్ సీట్లను పొందుపరిచారు. ఫోల్డింగ్ సీట్లను కారులో పరుపులాగా ఉపయోగించుకోవచ్చు.

హ్యాచ్‌బ్యాక్ కారు కావడంతో దంపతులతో పాటు పిల్లలు కూడా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. పిల్లలు బెడ్‌పై నిద్రపోవచ్చు. దీంతో పాటు కారులో బూట్ స్పేస్ కోసం తగినంత స్థలం ఉందని ఆ జంట పేర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసినప్పుడు వంట చేసుకోవడానికి.. ఇంకా భోజనం చేయడానికి ఇందులో అవసరమైన సామగ్రిని పెట్టుకోవచ్చు.
మారుతి స్విఫ్ట్ క్యారవాన్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10 లీటర్ల నీటిని సేకరించే సౌకర్యం ఉందని వారు వెల్లడించారు. ఇది కాకుండా, ఎలక్ట్రిసిటీ కోసం స్విఫ్ట్‌లో చిన్న కార్ ఇన్వర్టర్‌ను కూడా అమర్చారు. అందువల్ల, వారు ఏ అవసరం కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి సూపర్ కంఫర్టబుల్ కారుగా ఈ స్విఫ్ట్ కారును మార్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

క్యాంపర్ వ్యాన్‌లు, కారవాన్‌లు భారత్‌లో ప్రజాదరణ పొందుతున్నాయి. స్తోమత ఉన్నవారు పెద్ద పెద్ద వ్యాన్లు లేదా బస్సులను తమ క్యారవాన్లుగా వినియోగిస్తున్నారు. అంత బడ్జెట్ పెట్టలేని వారు తమ సెలవులను మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి తమ కార్లను క్యాంపర్ వ్యాన్‌లుగా లేదా కారవాన్‌లుగా మారుస్తూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications








