యాక్సిడెంట్: రెండు ముక్కలైన ఫెరారీ స్పోర్ట్స్ కారు
సాధారణంగా ఫెరారీ కార్లు జయ్‌మని వాయు వేగంతో దూసుకుపోతుంటాయి. అలాంటి కార్లు అంతటి గరిష్ట వేగంలో ప్రమాదానికి గురైతే ఇంకేమన్నా ఉన్నా కారు నుజ్జు నుజ్జు కావటం ఖాయం. ఇప్పుడు అదే జరిగింది. రష్యాలో మరో ఫెరారీ స్పోర్ట్స్ కారు ప్రమాదానికి గురైంది.
రష్యాలో గత శనివారం వేగంగా వెళ్తున్న ఓ 'ఫెరారీ 612 స్కాగ్లీట్టి' స్పోర్ట్ కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప స్థంభాన్ని ఢీకొట్టి రెండు ముక్కలుగా విరిగిపోయింది. అధిక వేగంతో వెళ్తున్న ఈ కారు అదుపు తప్పి డ్రైవర్ వైపు భాగం స్థంభాన్ని ఢీకొనడంతో కారు ముందు భాగం, ఇంజన్ పూర్తిగా కారు బాడీ నుంచి వేరిపడిపోయి ఆమడదూరంలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌తో సహా నలుగురు ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికీ పెద్దగా గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగానే ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి, ఈ సంఘటను చూసి అయినా వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటే చాలు.
ఫెరారీ 612 స్కాగ్లీట్టి స్పోర్ట్స్ కారు ఉత్పత్తిని ఫెరారీ ప్రస్తుతం నిలిపివేసింది. గతేడాదిలోనే ఈ మోడల్ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. దీని స్థానాన్ని ఫెరారీ ఎఫ్ఎఫ్ కారుతో కంపెనీ రీప్లేస్ చేసింది. ఫెరారీ 612 స్కాగ్లీట్టిలో శక్తివంతమైన 5.8 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 540 పిఎస్‌ల శక్తిని, 588 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 315 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications









