మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గిపోతోందా?.. మెకానిక్స్ కూడా చెప్పని ఈ టిప్స్ పాటించండి
పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగిపోతుందని ఈవీలను కొంటున్నారు. అయితే ఈవీ వినియోగదారులను ప్రధాన సమస్య రేంజ్.
కంపెనీ చెప్పిన మైలేజీ రాకపోవడం, ఊహించిన దానికంటే త్వరగా బ్యాటరీ అయిపోవడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఈవీ స్కూటర్ రేంజ్ ను గణనీయంగా పెంచుకోవచ్చు. మీ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకుంటూ ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడే చిట్కాలు తెలుసుకుందాం.

స్మూత్ డ్రైవింగ్
ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఒక్కసారిగా ఎగ్జిలరేటర్ (Accelerator) తిప్పడం. ఇలా చేయడం వల్ల మోటార్‌పై భారం పడి బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. స్కూటర్ ను మెల్లగా స్టార్ట్ చేసి, క్రమంగా స్పీడ్ పెంచడం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో పదే పదే ఆగి వెళ్లేటప్పుడు స్మూత్ డ్రైవింగ్ చాలా అవసరం.
రైడింగ్ మోడ్స్ పట్ల అవగాహన
దాదాపు అన్ని ఈవీ స్కూటర్లలో ఎకో (Eco), సిటీ (City), స్పోర్ట్స్ (Sports) మోడ్స్ ఉంటాయి. మీకు అత్యవసరమైతే తప్ప స్పోర్ట్స్ మోడ్‌ను వాడకండి. ఆఫీసు పనులకు లేదా సాధారణ ప్రయాణాలకు ఎకో మోడ్ ఉత్తమం. ఇది తక్కువ శక్తిని వినియోగించుకుంటూ ఎక్కువ రేంజ్ ఇస్తుంది. స్పీడ్ మోజులో పడి స్పోర్ట్స్ మోడ్ వాడితే బ్యాటరీ సగం దూరంలోనే హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది.

టైర్ ప్రెషర్ - చిన్న విషయం కానీ పెద్ద ఇంపాక్ట్
చాలా మంది టైర్లలో గాలిని పట్టించుకోరు. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుతో ఘర్షణ పెరిగి, మోటార్ పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది నేరుగా బ్యాటరీ రేంజ్‌ను తగ్గిస్తుంది. అందుకే వారానికి ఒకసారి టైర్ ప్రెషర్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. కంపెనీ సూచించిన మేర గాలి ఉంటే స్కూటర్ తేలికగా ముందుకు సాగుతుంది.
ఓవర్ లోడింగ్ వద్దు - బ్యాటరీని వేడి చేయకండి
స్కూటర్‌పై పరిమితికి మించి బరువు వేయడం వల్ల మోటార్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీని వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. అలాగే, ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించిన వెంటనే కారును లేదా స్కూటర్‌ను ఛార్జింగ్‌కు పెట్టకండి. బ్యాటరీ సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి. రీజెనరేటివ్ బ్రేకింగ్ (Regenerative Braking) సిస్టమ్ ఉన్న స్కూటర్లలో సాఫీగా బ్రేకులు వేయడం వల్ల కొంత శక్తి తిరిగి బ్యాటరీకి అందుతుంది.

నిపుణుల సలహా
బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తగ్గకుండా చూసుకోవడం మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే 100 శాతం నిండిన తర్వాత వెంటనే ప్లగ్ తీసేయాలి. నెలకు ఒక సారి బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఫుల్ ఛార్జ్ చేయడం (Deep Cycle) వల్ల బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. కచ్చితమైన సర్వీసింగ్ కూడా మోటార్, బ్యాటరీ మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.


Click it and Unblock the Notifications