లగ్జరీ కారు రోడ్డుపై వదిలి ఆటోలో వెళ్లిన మెర్సిడెస్ బెంజ్ CEO.. ఎందుకో తెలుసా?
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అందులోనూ బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ నగరాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్రాఫిక్ నుంచి బయటపడటానికి కొన్ని గంటల సమయం కూడా పడుతుంది.
ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో 'మార్టిన్ ష్వెంక్' కి ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఆ సమయంలో సీఈఓ కారుని వదిలేసి ఆటోలో గమ్యానికి చేరుకున్నాడు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నిజానికి మెర్సిడెస్ బెంజ్ సీఈవో 'మార్టిన్ ష్వెంక్' ఇటీవల పూణే లో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు. ఆ సమయంలో అతడు ఇక ఏమి చేయాలో తెలియక తన 'బెంజ్ ఎస్-క్లాస్' కారు దిగేసి కొన్ని కిలోమీటర్లు నడిచి తరువాత ఒక ఆటో రిక్షాలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నాడు. ఈ విషయాన్నీ అతడే స్వయంగా తెలిపాడు.

మార్టిన్ ష్వెంక్ ఆటోలో ప్రయాణించే ఒక ఫోటోను కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. ఇందులో 'మీ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు పూణె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? బహుశా కారు దిగి కొన్ని కిలో మీటర్లు నడిచి ఆ తర్వాత రిక్షా ఎక్కుతారా..? అంటూ రాసాడు.

మార్టిన్ ష్వెంక్ చేసిన ఈ పోస్టుకి ఏడువేలకు పైగా లైకులు వచ్చాయి, చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇందులో ఒకరు నీవు అదృష్టవంతుడివి, అందరికీ గమ్యానికి తీసుకెళ్లడానికి అంగీకరించే ఆటో డ్రైవర్లు దొరుకరు' అంటూ ఆటో డ్రైవర్లపై సెటైర్ వేశారు. ఇంకొకరు అయినా నాకు ఎస్ క్లాస్ ఉంటే హ్యాప్పీగా అందులోనే కూర్చుని ఆ కంపర్ట్ ఎంజాయ్ చేసేవాడిని అంటూ కామెంట్ చేశారు.

పూణే రోడ్లు చాలా ట్రాఫిక్ తో ఉంటాయి, ఆ ట్రాఫిక్ లో ఏదైనా గమ్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ముందుగానే బయలుదేరాలి, లేకుంటే చాలా కష్టం అవుతుంది. అయినప్పటికీ మనం ఎంత ముందుగా వెళ్లినా మన కర్మ కాళీ ట్రాఫిక్ ఎక్కువైతే ఏమి చేయలేము. కాబట్టి ట్రాఫిక్ ని ఏ సమయంలోనూ అంచనా వేయడానికి ఆస్కారం లేదు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో 'మార్టిన్ ష్వెంక్' 2018 లో కంపెనీకి సీఈఓ గా ఎన్నికయ్యాడు, కావున ఇప్పటికి కూడా సీఈఓ గా కొనసాగుతున్నాడు. ఈయన 2006 లో మెర్సిడెస్ బెంజ్‌లో జాయిన్ అయ్యి, 2018 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు.

ఇదిలా ఉండగా.. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కొత్త ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' (EQS 580 4Matic) అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకూండా ఇది అద్భుతమైన రేంజ్ కూడా అందిస్తుంది.

ఇప్పుడు Mercedes-Benz EQS 580 ఎలక్ట్రిక్ కారులో 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తమ్ మీద ఇది 523 హెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 857 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది.

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ 200 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 300 కిమీ వెళ్ళడానికి కావాల్సిన ఛార్జింగ్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో ఉన్నతమైన అధికారాల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మొదలైన వారు తప్పా, ట్రాఫిక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనటానికి ఇది ఒక నిదర్శనం. లగ్జరీ కార్ల తయారీ సంస్థకు సీఈఓ అయి కూడా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బెంజ్ కారు వదిలి ఆటో రిక్షాలో వెళ్లడం అనేది దేశంలో ట్రాఫిక్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








