కుక్కపిల్లకు 'మెర్సిడెస్ బెంజ్' లగ్జరీ బహుమతి.. వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వీడియోలను వైరల్ చేయడం మాత్రమే కాదు.. కొందరి ఆలోచనలను పంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలా ఓ వ్యక్తి తన మనసులోని ఆలోచనను సామాజిక మాధ్యమం ద్వారా ఓ ప్రముఖ కంపెనీని అభ్యర్థించారు. ఆ కంపెనీ వ్యక్తి అభ్యర్థన మేరకు ఓ మూగజీవికి వెలకట్టలేని సాయం చేసింది.
జర్మన్ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకుంది. లగ్జరీ కార్లను తయారు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్‌లో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది కార్ల నిర్మాణంతో కాదు.. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.

ప్రమాదంలో రెండు వెనుక కాళ్లను కోల్పోయిన ఓ శునకం కోసం జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. వెలకట్టలేని సాయం చేసింది. ఆ కుక్క కోసం వీల్ చైర్‌ను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న బన్నీ అనే కుక్కపిల్లని దాని యజమానులు వదిలేశారు. దీంతో మానవతా దృక్పథంతో హెన్రీ ఫ్రైడ్‌మాన్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమని పోస్ట్ చేశారంటే..

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఈ కుక్కపిల్ల కోసం కస్టమ్ మేడ్ వీల్ చైర్‌ను తయారు చేస్తే, అది మళ్లీ సులభంగా నడవగలదని వీడియో కింద హెన్రీ ఫ్రైడ్‌మాన్ వ్యాఖ్యానించారు. వీడియోతో పాటు ఈ వ్యాఖ్య కూడా ఫుల్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
వీడియోను పోస్ట్ చేసిన ఫ్రైడ్‌మన్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీని సంప్రదించి, ఆ కుక్క పిల్ల పరిస్థితి గురించి వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కొన్ని రోజుల తర్వాత, బన్నీ అనే ఈ కుక్కపిల్ల కోసం ప్రత్యేక వీల్ ఛైర్‌ను తయారు చేసింది. ఆ వీల్ ఛైర్‌ను కుక్క పిల్లకు బహుకరించారు.
సంఘటన అనంతరం ఫ్రైడ్‌మాన్ మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను అనుసరించారు. దీనిలో బన్నీ కుక్కపిల్లకు వీల్‌చైర్‌ను అందించడం చూడవచ్చు. మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఈ వీల్ చైర్ బన్నీ నడుముకి చుట్టి ఉంటుంది. ఆ వీల్ ఛైర్‌లో బన్నీని అమర్చిన అనంతరం అది సులభంగా అక్కడ పరిగెత్తడం ఎవరికైనా చాలా సంతోషం కలిగిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్‌లోని టీమ్ మొత్తానికి హెన్రీ ఫ్రైండ్‌మాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త వీల్‌చైర్ సహాయంతో, ఈ కుక్కపిల్ల మళ్లీ స్వేచ్ఛగా తిరగడానికి కొత్త ఉత్సాహాన్ని పొందినట్లేనని వ్యాఖ్యానించారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హెన్రీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది హార్ట్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇది చాలా అద్భుతమని, ఇది బన్నీ బెంజ్ అని.. బన్నీకి కొత్త జీవితం అందించినందుకు చాలా ఆనందంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. కుక్కపిల్లకు వీల్‌ఛైర్ అందించినందుకు మెర్సిడెస్ బెంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలా చాలామంది తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








