నెల్సన్ మండేలాకు మెర్సిడెస్ బెంజ్ ఇచ్చిన కానుక
దక్షిణాఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా ఇకలేరు. గడచిన కొద్ది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న నెల్సన్ మండేలా డిసెంబర్ 5, 2013న తుదిశ్వాస విడిచారు. స్థానిక సమయం ప్రకారం, డిసెంబర్5న 20:50 గంటల ప్రాంతంలో నెల్సన్ మండేలా మరణించట్లు ఆ దేశాధ్యుక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. నెల్సన్ మండేలా ఈ ఏడాది జులై 18వ తేదీన తన 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. నల్లజాతి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి ఆ మహా మనిషి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం..!
ఈ సందర్భంగా ఆయనను ఓసారి గుర్తు చేసుకుందాం. జర్మన్ ఆటో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నెల్సన్ మండేలాకు గతంలో ఓ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చింది. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (ఎస్500) లగ్జరీ సెలూన్‌ను ఈ జర్మన్ కంపెనీ ఆయనకు బహుకరించింది. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఈ కారును బహుకరించినట్లు మాచారం. ఈ కారు కూడా తన యజమాని (నెల్సన్ మండేలా) మాదిరిగానే ఓ చరిత్రగా మిగిలిపోయింది. ఆ చరిత్ర ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మండేలా విడుదల
1990లో విక్టర్ వెర్స్టర్ ప్రిజన్ లేదా డ్రాకెన్‌స్టీన్ కరెక్షనల్ సెంటర్ నుంచి నెల్సన్ మండేలా విడుదలయ్యారు. అప్పట్లో ఆయన విడుదల అత్యంత ముఖ్యమైన సందర్భంగా భావించి, కొందరు ఆయనకు ఓ ప్రత్యేకమైన కానుకను సమర్పించాలని భావించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బహుమతి
మెర్సిడెస్ బెంజ్ దక్షిణాఫ్రికా వర్కర్లు నెల్సన్ మండేలా ఓ విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న తక్షణమే ఎస్500 డబ్ల్యూ126 మోడల్ రెడ్ కలర్ ఎస్-క్లాస్ కారును కానుకగా ఇచ్చారు. ఈ మేరకు నేషనల్ యూనియన్ ఆఫ్ మెటల్‌వర్కర్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలోని వర్కర్లు మెర్సిడెస్ బెంజ్‌కు ఓ అభ్యర్థన పెట్టారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్500
అప్పట్లో నల్లజాతి కార్మికు సంస్థలను గుర్తించి, వారిని పని చేయటానికి అనుమతించిన అతికొద్ది సంస్థల్లో జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ కూడా ఒకటి. మండేలాకు కారును కానుకగా ఇవ్వాలన్న వర్కర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న మెర్సిడెస్ బెంజ్, ఈ ఎస్-క్లాస్ విడిభాగాలను వర్కర్లకు ఇచ్చింది. వర్కర్లు సాధారణ సమయం కన్నా ఎక్కువ సమయం పనిచేసి, నాలుగు రోజుల్లో ఈ కారును పూర్తిచేశారు.

చరిత్రలో ఓ భాగం
మండేలా మెర్సిడెస్ బెంజ్ కారును మడిబా మెర్క్ (Madiba's Merc) (మడిబా అనేది నెల్సన్ మండేలా వంశం పేరు) అని కూడా పిలిచేవారు. ఈ స్పెషల్ మెర్సిడెస్ కారుపై దక్షిణాఫ్రికా జెండా, మండేలా పేరు ఉంటాయి. ఈ కారు కేటాయించిన నెంబర్ ప్లేట్ "999 NRM GP" అని ఉంటుంది. ఇందులో ఎన్ఆర్ఎమ్ అంటే నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా అని కూడా అర్థం వస్తుంది. ప్రస్తుతం ఈ కారును జాన్నెస్‌బర్గ్ లోని అపార్ట్‌హీడ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.


Click it and Unblock the Notifications








