మాసిన బట్టలతో వచ్చాడని రైతుని మెట్రోలోకి అనుమతించని సిబ్బంది.. నెటిజన్ల ఫైర్, స్పందించిన అధికారులు
దేశానికే అన్నం పెట్టే రైతన్నకు మహానగరంలో అవమానం(Farmer Not Allowed In Metro) జరిగింది. నిత్యం మట్టితో మమేకమై మూడు పూటలా కడుపు నింపుతున్న అన్నదాత వస్త్రధారణను అవహేళన చేస్తూ కించపరిచిన సంఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉండే పబ్లిక్ రవాణా మెట్రోలో ఈ అమానవీయ దృశ్యం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహా నగరాల్లో ప్రజా రవాణా పరంగా ఆర్టీసీ సేవల తర్వాత ఎక్కువగా ఆదరణ పొందుతున్న రంగం మెట్రో రైల్వే. రోజూ లక్షలాది ప్రయాణికులు ఈ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ రైతును మెట్రో సిబ్బంది చిన్నచూపు చూసిన సంఘటన చోటుచేసుకుంది.

మాసిన దుస్తులు ధరించాడంటూ ఓ రైతుని మెట్రో రైలు ఎక్కనివ్వకుండా మెట్రోలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ అడ్డుకున్నారు. మూడు రోజుల క్రితం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. సంబంధిత అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
అసలు విషయానికొస్తే.. గత కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ నుంచి మరో చోటుకి వెళ్లేందుకు ఓ రైతు మెట్రో టికెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం స్టేషన్ లోపలికి వెళుతుండగా చెక్ ఇన్ సమయంలో రైతు దుస్తులు సరిగ్గా లేవంటూ, మాసిన దుస్తులు ధరించాడంటూ సెక్కూరిటీ సూపర్‌వైజర్ ఆ రైతుని లోపలికి వెళ్లనివ్వలేదు.

ఈ క్రమంలో ఆ రైతు పక్కన సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో నిల్చున్న ఓ ప్రయాణికుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. ఏ కారణం చేత రైతుని మెట్రో రైలు ఎందుకు ఎక్కనివ్వడం లేదంటూ భద్రతా సిబ్బందిని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు. ఆ రైతు తీసుకెళ్తున్న సంచిలో నిషేధించబడిన వస్తువులేమైనా ఉన్నాయా అని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
అంతేకాకుండా మెట్రోలో ప్రయాణించాలంటే తప్పనిసరి డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అని సిబ్బందిని ప్రయాణికుడు ప్రశ్నించారు. అలా ఏదైనా నిబంధన ఉంటే తనకు చూపించాలని డిమాండ్ చేశారు. ఆ రైతు చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌తోనే మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చాడని.. ఉపయోగించుకునే హక్కు తనకు ఉందని రైతుకు మద్దతుగా మాట్లాడాడు.

అయితే ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియా X(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో ప్రయాణికుడు వాగ్వాదం తర్వాత పాటు మెట్రోలో తమతో పాటు ప్రయాణించాలని రైతుని ఆ వ్యక్తి కోరడం వీడియోలో చూడవచ్చు. కాగా ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.
మెట్రోలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. మెట్రో కార్పొరేషన్ అధికారులపై సామాజిక మాధ్యమాల వేదికగా మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతు అంటే అంత అలుసా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని.. మెట్రో అనేది కేవలం వీఐపీల కోసం మాత్రమేనా అని.. పబ్లిక్ సర్వీస్ అందరి కోసమని రైతుకు మద్దతుగా కామెంట్లు చేశారు.
ఈ వీడియో వైరల్ కావడం.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సంఘటనపై బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారులు స్పందించారు. ఈ ఘటనపై సోమవారం విచారణ జరిపారు. రైతు వస్త్రధారణపై చులకన చేసి మాట్లాడిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను పదవి నుంచి తొలగించారు.


Click it and Unblock the Notifications








