నీ కష్టం వృథా కాలేదు బాలయ్య! Tvs Xl బండితో సర్‌ప్రైజ్ చేసిన వేములవాడ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హృదయానికి హత్తుకునే ఘటన వైరల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఒక అభిమానికి ఎమ్మెల్యే ఇచ్చిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల తన మద్దతుదారుడు బాలయ్యకు కొత్త TVS XL 100 మోపెడ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఎన్నికల సమయంలో గ్రామాలు తిరిగి తన విజయానికి ఎంతగానో సహకరించిన ఈ అభిమాని పట్ల కృతజ్ఞతగా ఆయన ఈ గిఫ్ట్ అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేములవాడకు చెందిన బాలయ్య అనే కూరగాయల వ్యాపారి, తన జీవనోపాధి కోసం ఉపయోగించే బండిపైనే మైక్రోఫోన్ అమర్చి, రోజంతా కూరగాయలు అమ్ముతూ కూడా ఆది శ్రీనివాస్ తరపున ప్రచారం చేశాడు. ఆది శ్రీనివాస్ గెలవాలి అంటూ గ్రామాల చుట్టూ తిరిగి ప్రజలకు ఆకట్టుకున్నాడు. ఎన్నికల సమయంలో ఆ చిన్న వ్యాపారి ప్రచారం, ఎమ్మెల్యే గెలుపుకు ఒక ప్రేరణగా నిలిచింది.

నిబద్ధతతో కష్టపడిన అభిమాని పట్ల కృతజ్ఞతగా, తాజాగా ఆది శ్రీనివాస్ స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లారు. ముందుగా ఆయనను షాలువతో సత్కరించి, బాలయ్య ఉపయోగిస్తున్న బండి పరిస్థితిని అడిగారు. అప్పుడు బాలయ్య తన వాహనం చెడిపోయిందని, దానితోనే ఇంతకాలం జీవనోపాధి కొనసాగించానని చెప్పాడు. దీనికి స్పందించిన ఆది శ్రీనివాస్, కొత్త బండి కొనిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ, కొత్త TVS XL 100 మోపెడ్‌ను గిఫ్ట్‌గా అందజేశారు.
ఈ సందర్భంలో జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఎమ్మెల్యే స్వయంగా కొబ్బరికాయలు పగలగొట్టి కొత్త బైక్‌కి పూజ చేసి, బైక్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఆయన స్వయంగా బండిపై కూర్చుని బాలయ్యతో కలిసి ఓ రౌండ్ తిరిగారు. ఎన్నికల కష్టకాలంలో తన కోసం అహర్నిశలు కష్టపడ్డ సాధారణ వ్యాపారిని, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

TVS కంపెనీ తయారు చేసిన TVS XL 100 మోపెడ్ భారతీయ మార్కెట్లో ఎంతోకాలంగా ప్రజాదరణ పొందుతున్న మోడల్. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, బలమైన నిర్మాణం కారణంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి జీవనాధారంగా మారింది. ధర ప్రస్తుతం రూ. 43,900 నుండి రూ. 59,000 (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ దీనిని పలు వేరియంట్లలో అందిస్తోంది.
ఇది హెవీ డ్యూటీ, హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్, హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్, కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్, HD అల్లాయ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 99.7 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. 6000 rpm వద్ద 4.3 BHP పవర్, 3500 rpm వద్ద 6.5 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ శక్తివంతమైనప్పటికీ, గ్రామాల్లో బరువులు మోయడానికి సరిపోయేంత టార్క్‌ను ఇస్తుంది.
TVS XL 100 అనేక ఉపయోగకరమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనలాగ్ టైప్‌లో ఉంటుంది. సైలెంట్ స్టార్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది, ఇది నగరాల్లో లేదా ఉదయం వేళల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బల్బ్ ఇండికేటర్లు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా అందించబడటం గమనార్హం. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.


Click it and Unblock the Notifications








