Chandrayaan-3 చంద్రయాన్-3 ప్రయోగం ఎందుకు చేస్తున్నారో తెలుసా.. గతంలా జరగకుండా..!
జులై 14 భారత్‌దేశ అంతరిక్ష చరిత్రలో చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. చంద్రుని రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి జరగనుంది. ఈ మిషన్‌పై ఇస్రో సహా యావత్ దేశంలో ఎన్నో ఆశలు పెట్టుకుంది. చంద్రయాన్2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని అత్యంత కచ్చితత్వంతో ప్రయోగిస్తోంది.
అయితే చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా భారత్ ఏం ఆశిస్తోంది.. ఈ ప్రయోగం కోసం ఇస్రో చేసిన ఖర్చు ఎంత.. అసలు ఈ మిషన్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి.. ఈ ప్రయోగానికి ఏ రాకెట్‌ను వినియోగిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోనికి ఏమేం పంపిస్తున్నారు.

చంద్రయాన్ ప్రయోగానికి ఈ మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-3 ప్రయోగం జరగనుంది. ఇందుకోసం ఇస్రో అన్ని ఏర్పాటు చేసింది.
చంద్రుడిపై ప్రయోగాలను 2008లో భారత్ ప్రారంభించింది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికి ఉందని తొలిసారిగా కనుగొంది. అనంతరం చంద్రుడి మీదకు ల్యాండర్ దించి చంద్రుని దక్షిణ ద్రువం పైన పరిశోధనలు చేయాలనేది చంద్రయాన్ మిషన్ ముఖ్య ఉద్దేశం.

ఇందుకోసం 2019 జులై 22న చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే అనుకున్న విధంగానే ఆర్పిటర్ విడిపోయింది. చంద్రుడిని కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ రెండు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి.
చంద్రయాన్-2 ప్రయోగం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత అంతరిక్ష సంస్థ- ఇస్రో.. చంద్రయాన్-3 కోసం అత్యంత కచ్చితత్వంతో పనిచేసింది. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సరిచూసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఎలాగైన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను సురక్షిత ల్యాండింగ్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
అయితే చంద్రుని ఉపరితలంపైకి ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా తమ ల్యాండర్లను పంపాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ను దించి, అక్కడ కీలక పరిశోధనలు చేయాలని ఇస్రో లక్ష్యంగా పనిచేస్తోంది. చంద్రుని యొక్క దక్షిణ ప్రాంతంలో సూర్యకాంతి పడని ఎన్నో ప్రాంతాలున్నాయని ఇస్రో భావిస్తోంది.
అలాంటి చోట ప్రయోగాలు నిర్వహించి విశ్వం పుట్టుగ యొక్క రహస్యాలు, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులు నివసించేందుకు గల అవకాశాలపై ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చుచేసింది. ఈ మిషన్‌లో భాగంగా LVM3-M4 రాకెట్ ద్వారా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నింగిలోని పంపుతుంది.
చంద్రయాన్-2 ప్రయోగంలో పంపిన ఆర్బటర్ ఇప్పటి విజయవంతంగా పనిచేస్తున్నందున ఈసారి ఆర్బిటర్‌ను పంపడం లేదు. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్‌లు మాత్రమే పంపిస్తున్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. ఈ మిషన్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపైన ల్యాండర్‌ను దించి రికార్డు సృష్టించాలని, తద్వార అక్కడ కీలక ప్రయోగాలు చేసి విశ్వం యొక్క గుట్టువిప్పాలని ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








