ముంబైలో అత్యధికంగా దొంగిలించబడే టాప్ 5 కార్లు
ఇటీవలే అమెరికాలో ప్రతి 11 నిమిషాలకు ఒక బైక్ చోరీకి గురవుతున్నట్లు ఓ కథనంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు మనదేశంలో కూడా చోటుచేసుకుంటున్న ఇలాంటి మరొక సంఘటనను పరిశీలిద్దాం రండి..! ముంబైలో ఆ ఐదు రకాల కార్లను కొనుగోలు చేయాలంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏంటా ఐదు కార్లు..? వాటి కథ ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. అయితే, ఈ కథనం చదవండి.
ముంబైలో కార్ల చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముంబై పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, గడచిన సంవత్సరంలో అత్యధికంగా దొంగిలించబడిన టాప్ 5 కార్లలో మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ మొదటి స్థానంలో ఉండగా, మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చెవర్లే తవేరా, హ్యుందాయ్ శాంత్రో, టాటా ఇండికా మొదలైన కార్లు ఉన్నాయి.

టాప్ 5 స్టోలెన్ కార్స్ - మహీంద్రా స్కార్పియో
గడచిన సంవత్సరంలో ముంబైలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లలో మహీంద్రా స్కార్పియో అగ్రస్థానంలో ఉంది. ఆ సమయంలో ఇవి సుమారు 133 కార్లు దొంగిలించబడ్డాయి. 2010లో వీటి సంఖ్య 148గా ఉన్నట్లు పోలీసులు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

టాప్ 5 స్టోలెన్ కార్స్ - మహీంద్రా బొలెరో
ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న కారు కూడా మహీంద్రాదే కావటం గమనార్హం. 2010లో 79 మహీంద్రా బొలెరోలు చోరీకి గురి కాగా.. 2011లో 106 మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలు చోరీ అయినట్లు పోలీసు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

టాప్ 5 స్టోలెన్ కార్స్ - చెవర్లే తవేరా
జనరల్ మోటార్స్ నుంచి పాపులర్ అయిన ఎమ్‌పివి చెవర్లే తవేరా కూడా చోరీకి గురయ్యే కార్లలో అగ్ర స్థానంలోనే ఉంది. 2010లో 67 చెవర్లే తవేరా ఎమ్‌పివిలు చోరీకి గురి కాగా 2011లో 106 చెవర్లే తవేరాలు చోరీ కాబడ్డాయి.

టాప్ 5 స్టోలెన్ కార్స్ - హ్యుందాయ్ శాంత్రో
హ్యుందాయ్ నుంచి మార్కెట్లో లభిస్తున్న చిన్న కారు హ్యుందాయ్ శాంత్రో కూడా చోరీకి గరయ్యే కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. 2010లో 83 శాంత్రో కార్లు చోరీకి గురి కాగా, 2011లో 106 శాంత్రో కార్లు చోరీకి గురయ్యాయి.

టాప్ 5 స్టోలెన్ కార్స్ - టాటా ఇండికా
చోరీకి గురయ్యే కార్లలో టాటా కార్లు కూడా టాప్ పొజిషన్‌లోనే ఉన్నాయి. 2010లో 61 టాటా ఇండికా కార్లు చోరీ కాబడగా, 67 టాటా ఇండికా కార్లు చోరీ అయ్యాయి.
ముంబై పోలీసుల సమాచారం ప్రకారం, 2011లో దాదాపు 1,540 వాహనాలు (అధికారిక లెక్కల ప్రకారం) చోరీకి గురయ్యాయి. వీటిలో 133 వాహనాలు మహీంద్రా స్కార్పియోలు కాగా.. 160 మహీంద్రా బొలెరోలు, 106 చెవర్లే తవేరాలు, 106 శాంత్రోలు మరియు 67 ఇండికా కార్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో ఇతర కార్ కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి.
దొంగలు మెచ్చే టాప్ 5 కార్లు:
- మహీంద్రా స్కార్పియో
- మహీంద్రా బొలెరో
- చెవర్లే తవేరా
- హ్యుందాయ్ శాంత్రో
- టాటా ఇండికా
మరి ఈ కార్లు దొంగిలించబడటానికి కారణం వీటిలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్ల లోపమా..? లేక చోరుల చోరకళానైపుణ్యమా అనేది తేలాల్సి ఉంది. ఈ ససమ్య ఒక్క ముంబైలోనే కాదు, దేశంలోని అన్ని చోట్ల ఉంది. కార్లు దొంగతనానికి గురి కాకుండా ఉండటానికి ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, మన జాగ్రత్తలో మనం లేనప్పుడు (మన టైమ్ బాగో లేనప్పుడు కూడా అనుకోండి) లక్షల ఖరీదు చేసే కారుపై ఆశలు వదులుకోక తప్పదు. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications








